ప్రజలను వంచించడం కాంగ్రెస్ ​నైజం:బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు

  • గ్యారంటీల్లో ఒక్కటీ నెరవేర్చలేదు: కాసం వెంకటేశ్వర్లు 

హైదరాబాద్, వెలుగు: ఉచిత బస్సుతో సహా ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్కటి కూడా పూర్తిగా నెరవేర్చలేదని,  ప్రజలను వంచించడం కాంగ్రెస్ నైజమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఆరోపించారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.  తెలంగాణలో వెయ్యి మందికిపైగా బలిదానాలకు కారణమైన బలిదేవత సోనియాగాంధీ అన్న రేవంత్ రెడ్డి..ఇప్పుడు మాట ఎందుకు మార్చారని ప్రశ్నించారు. 

రేవంత్ రెడ్డి పదవుల కోసం పార్టీలు, మాటలు మార్చే రకమని ఫైర్ అయ్యారు. కాకులు పోయి గద్దలు వచ్చినట్టుగా తెలంగాణలో రాబందుల, రాక్షసుల పాలన వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. హామీల్లో ఎన్ని నెరవేర్చారో చెప్పాలన్నారు. కాంగ్రెస్​మూసీ పేరుతో హైదరాబాద్‌‌ను ఆగం చేయాలని చూస్తున్నదని, ఆ పార్టీని ప్రజలు అదే మూసీలో వేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. రేవంత్​రెడ్డికి  బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించే స్థాయి లేదన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న  రేవంత్ రెడ్డి  నోరు అదుపులో పెట్టుకోవాలని కాసం వెంకటేశ్వర్లు సూచించారు.