నిర్మల్, వెలుగు: రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ శ్రేణులు రెడీగా ఉండాలని బీజేపీ రాష్ట్ర ఇన్చార్జ్ సునీల్ బన్సల్ సూచించారు. ఆదివారం నిర్మల్ లో జరిగిన ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బీజేపీ సమీక్షా సమావేశానికి సునీల్ బన్సల్ హాజరై అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రివ్యూ నిర్వహించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బూత్ స్థాయి నుంచి పార్టీని మరింత పటిష్టం చేయాలన్నారు. క్రమశిక్షణకు మారుపేరైన బీజేపీలో అందరికీ ఒకే రకమైన ఆదరణ ఉంటుందని, పార్టీ కోసం కష్టించి పనిచేసే కార్యకర్తలందరికీ అధిష్టానం తప్పక ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. ఛత్తీస్ గఢ్ లో బీజేపీ సానుభూతిపరుడైన ఓ కూలికి అసెంబ్లీ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నామని గుర్తుచేశారు.
పార్లమెంట్ ఎన్నికలను ప్రతి కార్యకర్త ప్రతిష్టాత్మకంగా తీసుకొని, సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై మరింత ప్రచారం కల్పించాలని.. ఆ పథకాలన్నీ ప్రజలకు చేరేలా చూడాలని సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో నిర్మల్, ముథోల్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్, పార్టీ రాష్ట్ర నాయకుడు ప్రేమేందర్ రెడ్డి, అదిలాబాద్ పార్లమెంట్ ఇన్చార్జ్ అయ్యన్నగారి భూమయ్య, పెద్దపల్లి జిల్లా ఇన్చార్జ్ రావుల రామనాథ్, నిర్మల్ జిల్లా ప్రెసిడెంట్ అంజుకుమార్ రెడ్డి, నాయకులు మల్లారెడ్డి, మెడిసెమ్మ రాజు, సామ రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.