చండూర్లో నాయకులు, కార్యకర్తలతో సునీల్ బన్సల్ భేటీ

మునుగోడు ఉప ఎన్నికకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలన్నీ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. పోటాపోటీగా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ సునీల్ బన్సల్ మునుగోడులో అడుగుపెట్టారు. బీజేపీ ఆర్గనైజింగ్ జాయింట్ జనరల్ సెక్రటరీ శివ ప్రకాష్ తో కలిసి ఆయన మునుగోడు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఉప ఎన్నికను స్వయంగా పర్యవేక్షిస్తున్న  బీజేపీ అగ్రనేత అమిత్ షాకు సునీల్ బన్సల్ ఎప్పటి కప్పుడు నివేదికలు పంపుతున్నారు.

మరోవైపు ఉప ఎన్నికకు సంబంధించి సునీల్ బన్సల్ పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. చండూరు మున్సిపాలిటీలోని బీఆర్సీ గార్డెన్ లో గ్రామ శాఖ అధ్యక్షులు, బూత్ కమిటీ ఇంఛార్జులు, ఇతర ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. రాజగోపాల్ రెడ్డి విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై బన్సల్ వారికి సూచనలు సలహాలు ఇస్తున్నట్లు సమాచారం.