సంస్థాగత ఎన్నికలపై నేడు బీజేపీ స్టేట్ లెవల్ వర్క్​షాప్

సంస్థాగత ఎన్నికలపై నేడు బీజేపీ స్టేట్ లెవల్ వర్క్​షాప్
  • 8 నుంచి మూడ్రోజుల పాటు జిల్లాల్లో సమావేశాలు

హైదరాబాద్, వెలుగు: బీజేపీలో సంస్థాగత ఎన్నికల హడావుడి మొదలైంది. బూత్ లెవల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొత్తగా కమిటీలు వేసేందుకు ఆ పార్టీ షెడ్యూల్ ఖరారు చేసింది. దీంట్లో భాగంగా గురువారం హైదరాబాద్ లో స్టేట్ లెవల్ వర్క్ షాప్ నిర్వహిస్తున్నది. దీనికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు పార్టీ జాతీయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె.లక్ష్మణ్, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, బీజేపీఎల్​పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొంటారని బీజేపీ లీడర్లు బుధవారం ప్రకటించారు. 

వీరితో పాటు తాజా మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్టేట్ ఆఫీస్ బేరర్లు, జాతీయ, రాష్ట్ర నేతలు, అనుబంధ సంఘాల స్టేట్ ప్రెసిడెంట్లు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, జిల్లాల ఎన్నికల అధికారులు అటెండ్ కానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల సభ్యత్వాలు నమోదు చేయించాలని పార్టీ నేతలు టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు సుమారు 30 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయి. వీటిలో యాక్టివ్ మెంబర్ షిప్ లెక్కలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే కమిటీలు వేసేందుకు కసరత్తు చేస్తున్నారు. 

పార్టీ బలోపేతానికి ఉపయోగపడేలా కమిటీలు

కొన్ని నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. పార్టీ కమిటీల ఏర్పాటును బీజేపీ కీలకంగా తీసుకున్నది. పార్టీ బలోపేతానికి ఉపయోగపడేలా కమిటీలు వేయాలని నిర్ణయించింది. సంస్థాగత ఎన్నికలపై ఈ నెల 7న హైదరాబాద్​లో సమావేశం నిర్వహించనున్నారు. ఆ వెంటనే 8, 9, 10వ తేదీల్లో జిల్లా స్థాయిల్లో వర్క్ షాపులు పెట్టాలని భావిస్తున్నారు. 

జిల్లా సమావేశాలు పూర్తికాగానే.. 11 నుంచి 14వ తేదీ వరకు మండల స్థాయి వర్క్ షాపులు పెట్టి కమిటీల ఏర్పాటుపై ఫోకస్ చేయాలని పార్టీ నిర్ణయించింది. ఈ నెలాఖరులోగా రాష్ట్రంలోని అన్ని బూత్ కమిటీలు వేయాలని యోచిస్తున్నది. డిసెంబర్ లో మండల, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నది.