కాంగ్రెస్​ది గ్యారంటీల గారడీ .. ఏడాది అవుతున్నా హామీలు అమలు చేయలే: కిషన్ రెడ్డి

  • కేసీఆర్ లెక్కనే రేవంత్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నరు
  • ‘6 అబద్ధాలు.. 66 మోసాలు’పేరుతో చార్జ్​షీట్ రిలీజ్ చేసిన బీజేపీ స్టేట్​ చీఫ్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ది గ్యారంటీల గారడీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల ముందు అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి ఇప్పుడు గారడీలు చేస్తున్నదని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నిం చారు. ఏడాది కావస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. 

ఇంకా రైతుల రుణమాఫీ కాలేదని, రైతు భరోసా ఇవ్వలేదని విమర్శించారు. హైదరాబాద్​లోని ఓ హోటల్​లో కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది వైఫల్యాలపై ‘6 అబద్ధాలు.. 66 మోసాలు’’పేరుతో చార్జ్​షీట్​ను బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నేతలు ఆదివారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ నేతలు ఎన్నో చేశామని చెప్తున్నరు.. వాటన్నింటిపై చర్చకు మేం సిద్ధం. కాంగ్రెస్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం.. గ్రూప్స్ నియామకాలు ఎప్పుడో పూర్తి కావాలి. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నరు. 

పదేండ్ల బీఆర్ఎస్ పాలన.. ఏడాది కాంగ్రెస్ పాలన ఒకేలా ఉన్నది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు.. భూసేకరణ చేపట్టొద్దని కాంగ్రెస్ నేతలు ధర్నా చేసిన్రు. ఇప్పుడు నిబంధనల ప్రకారమే భూసేకరణ జరపాలి. లగచర్లలో రైతులతో మాట్లాడి సమస్య పరిష్కరించకుండా వారిపై దాడులు చేస్తే ఎలా?’’అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఫాంహౌస్​లో ఉన్న కేసీఆర్​తో కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నదని ఆరోపించారు. 

స్టూడెంట్లకు క్వాలిటీ భోజనం పెట్టాలి

రాష్ట్ర ప్రజల ఆశయాలకు విరుద్ధంగా బీఆర్ఎస్ పాలన కొనసాగిందని, కాంగ్రెస్ కూడా అలాగే పాలిస్తున్నదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ‘‘ఎన్నికల టైమ్​లో 10 పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి.. అధికారంలోకి వచ్చాక సన్నాలకే అని మోసం చేసిన్రు. నిరుద్యోగులు, మహిళలు, పెన్షనర్లు, అన్ని వర్గాలను దగా చేసింది. బడుల్లో క్వాలిటీ మీల్స్ పెట్టకపోవడంతో ఫుడ్ పాయిజన్ అవుతున్నది. బస్తీల్లో స్కూళ్లు ఓపెన్ చేస్తామని చెప్పి.. ఉన్న స్కూల్స్​ను మూసిసేస్తున్నరు’’అని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు.