- అన్నివర్గాల ప్రజలకు అండగా నిలవాలి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
- సికింద్రాబాద్ లో బీజేపీ సంస్థాగత ఎన్నికల కార్యశాల
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆరు గ్యారంటీల హామీ అమలులో రైతులు, బడుగు బలహీన వర్గాలు, నిరుద్యోగులు, నిరుపేదలు, మహిళలతో కలిసి పోరాడాలని సూచించారు. గురువారం సికింద్రాబాద్ సిఖ్ విలేజ్లో బీజేపీ సంస్థాగత ఎన్నికల వర్క్ షాప్ నిర్వహించారు.
ఈ సమావేశానికి కిషన్ రెడ్డి హాజరై మాట్లాడారు. గత బీఆర్ఎస్ సర్కార్ రూ.7 లక్షల కోట్లు అప్పుచేసి వెళ్లిపోతే.. కొత్తగా వచ్చిన ప్రభుత్వం అంతకన్నా రెట్టింపు అప్పులు చేసేందుకు ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. చివరి గింజ వరకు ధాన్యం కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మిల్లర్లు, కాంట్రాక్టర్లతో కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తోందని విమర్శించారు.
కొత్తవారికి అవకాశం ఇవ్వాలి..
పార్టీకి కొత్త తరం అవసరమని, పార్టీ పదవుల్లో కొత్తవారికి అవకాశం కల్పించాలని నేతలకు కిషన్రెడ్డి సూచించారు. ఇతర పార్టీలు కుటుంబాల ఆధారంగా నడుస్తాయని, ఆ పార్టీలకు ప్రెసిడెంట్ ఎవరు అవుతారో ముందే చెప్పొచ్చని.. కానీ, బీజేపీలో అలా ఉండదన్నారు. పార్టీలో ఎవరైనా అధ్యక్షుడు కావొచ్చన్నారు. శుక్రవారం మండల, జిల్లా కమిటీల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందన్నారు. మూసీ పరీవాహక ప్రాంతంలో త్వరలో నిద్ర చేస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. ఒక రోజు అక్కడే నిద్రిస్తామని, అక్కడ ఉంటున్న వారి ఇండ్లలోనే తింటామని తెలిపారు.
ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ, బీజేపీలో బై వన్, గెట్ వన్ పాలిటిక్స్ ఉండబోవన్నారు. ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంగా బీజేపీ రాజకీయాలు చేయదని, అడ్డదారులు తొక్కే పార్టీ కాదన్నారు. ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది కుల గణననా? లేక సమగ్ర కుటుంబ గణననా? తేల్చాలని డిమాండ్ చేశారు.