![లిక్కర్ దందా చేసినోళ్లను జనం ఎన్నుకోలే..అవినీతికి కేరాఫ్‌గా కేజ్రీవాల్ మారిండు : కిషన్‌రెడ్డి](https://static.v6velugu.com/uploads/2025/02/bjp-state-president-and-union-minister-kishan-reddys-comments-on-arvind-kejriwal_pnszcGojPt.jpg)
- తెలంగాణలో బీజేపీ వైపు ప్రజల చూపు
- దాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుగా మలుచుకోవాలి
- పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలకు పిలుపు
హైదరాబాద్, వెలుగు : లిక్కర్ దందా చేసినోళ్లను ఎన్నుకోకుండా ప్రజలు పక్కనపెట్టారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దక్షిణ భారత్‌లో పుదుచ్చేరి, ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలో ఉందని.. త్వరలోనే కర్నాటక, తమిళనాడు, తెలంగాణలోనూ అధికారంలోకి రాబోతున్నామని తెలిపారు. ప్రస్తుతం బీజేపీ వైపు తెలంగాణ ప్రజలు చూస్తున్నారని, దాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుగా మలుచుకోవాలని పార్టీ నేతలకు సూచించారు.
శనివారం హైదరాబాద్ లోని ఓ హోటల్ లో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలతో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. తర్వాత బీజేపీ స్టేట్ ఆఫీసులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. లిక్కర్ స్కామ్ పై ప్రజలే రిఫరెండం ఇస్తారని కేజ్రీవాల్ చెప్పారని, ప్రజాకోర్టు సరైన తీర్పునిచ్చిందన్నారు. ఇక లిక్కర్ స్కామ్ లో న్యాయస్థానం తీర్పు మాత్రమే మిగిలి ఉందని తెలిపారు. కాంగ్రెస్ అవినీతి పాలనను అరికడతామని ఢిల్లీలో ఆప్ అధికారంలోకి వచ్చిందని, చివరకు అవినీతికి కేరాఫ్ గా కేజ్రీవాల్ మిగిలారని విమర్శించారు.
ప్రజల కోసం రూ.5 ఖర్చు పెడితే రూ.95ను తన వ్యక్తిగత పబ్లిసిటీకి వాడుకున్నారని ఆరోపించారు. దేశంలో జైలు నుంచి పాలించిన ఏకైక సీఎం కేజ్రీవాల్ అని, సిగ్గు లేకుండా ప్రజల ఆరోగ్యం దెబ్బతీసే లిక్కర్ పాలసీ స్కామ్ లో జైలుకెళ్లి అక్కడి నుంచి పాలించారని విమర్శించారు. అవినీతితో ఇన్నేండ్లు అభివృద్ధికి నోచుకోని ఢిల్లీలో ఇక నుంచి అభివృద్ధియే లక్ష్యంగా బీజేపీ పాలన సాగనున్నట్టు చెప్పారు.
బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్‌పాలన
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించిందని, అదే ఊపుతో తెలంగాణలోనూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేలా పార్టీ నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ‘దేశవ్యాప్తంగా బీజేపీ అంటేనే ఓ నమ్మకం.. నిజాయతీ పాలన బీజేపీతోనే సాధ్యం. రాష్ట్రంలో బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్ని వర్గాలను మోసం చేసింది.
కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నది. బీసీలను అవమానిస్తూ.. అన్యాయం చేస్తున్నారు. బీసీల్లో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది’’ అని కిషన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కలిసి కట్టుగా పనిచేయాలని నేతలను ఆదేశించారు.
రాహుల్ నాయకత్వంలో అన్ని ఓటములే
కాంగ్రెస్ దీన స్థితిని చూస్తుంటే జాలి కలుగుతున్నదని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాహుల్ నాయకత్వం చేపట్టాక ఆ పార్టీకి అన్ని ఓటములే అన్నారు. కాంగ్రెస్ నేతలకే ఆయనపై విశ్వాసం లేదని, అలాంటిది ప్రజలు ఎలా విశ్వసిస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్, ఆప్.. ఒకే నాణేనికి బొమ్మ, బొరుసులాంటివని, అబద్ధాలు చెప్పడం, ప్రజలను రెచ్చగొట్టడంలో రాహుల్, కేజ్రీవాల్ పోటీపడతారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి ప్రచారం చేసిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిందని గుర్తుచేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ఎలా గెలిచిందో కేటీఆర్ సమాధానం చెప్పాలని, ట్విట్టర్ టిల్లు లాంటి వారి గురించి ఎక్కువగా మాట్లాడనవసరం లేదన్నారు. సన్నాహక సమావేశంలో కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీలు లక్ష్మణ్, డీకే అరుణ, రఘునందన్ రావు, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య, గ్రాడ్యుయేట్ సెగ్మెంట్ అభ్యర్థి అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.