షాద్నగర్: డ్రగ్స్ తో మీ కుటుంబానికి సంబంధం ఉందని నిరూపిస్తా ... అరెస్ట్ చేసే దమ్ముందా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. బంజరాహిల్స్ పుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసుతో చాలా మంది ప్రముఖులకు సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఆదివారం షాద్నగర్ లో నిర్వహించిన ‘ప్రైమ్ మినిస్టర్ క్రికెట్ కప్-2022’లో పాల్గొన్న బండి సంజయ్ టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ కేసుతో కేసీఆర్ కుటుంబ సభ్యులకు లింకు ఉందని ఆరోపించారు. తమ కార్యకర్తలకు డ్రగ్స్ తో సంబంధం ఉన్నట్లు తేలితే అరెస్టు చేసుకోవచ్చని, కానీ తమ కార్యకర్తలు అలాంటి పనులు చేయరని స్పష్టం చేశారు. డ్రగ్స్, వైన్స్ తో కేసీఆర్ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారన్నారు. తాగి బండి నడిపితే తప్పయినప్పుడు... తాగి రాష్ట్రాన్ని నడుపుతున్న కేసీఆర్ది తప్పు కాదా అని ప్రశ్నించారు. రాష్ట్ర పాలనను తండ్రి కొడుకులు గాలికొదిలేశారన్నారు. సీఎం సీటు కావాలని కొడుకు డాడీ డాడీ అంటుంటే.... కేసీఆర్ ప్యాడీ ప్యాడీ అని తిరుగుతున్నారని విమర్శించారు. కేసీఆర్ కు త్వరలోనే హైదరాబాద్ ఫైల్స్ చూపిస్తామని హెచ్చరించారు.