డ్వాక్రా గ్రూప్ మహిళలకు కేసీఆర్ అన్యాయం

యాదాద్రి భువనగిరి: రాఖీ పండుగ సందర్భంగా డ్వాక్రా మహిళలకు ఇవ్వాల్సిన వడ్డీ బకాయిలు విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ ఈ మేరకు సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. తన ఎనిమిదేళ్ల పాలనలో డ్వాక్రా గ్రూపులను సర్వనాశనం చేశారని సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. డ్వాక్రా గ్రూపులకు వడ్డీ కింద 2021 22 లో రూ.3 వేల కోట్లు, 2022 23 లో రూ.1250 కోట్లు కేటాయించినప్పటికీ... ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని తెలిపారు. 

గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్‌), పట్టణపేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా), ఎస్‌హెచ్‌జీ లకు ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ బకాయిలు రూ.4 వేల కోట్ల వరకు పేరుకుపోయాయన్న ఆయన... దీంతో మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం నుండి వడ్డీ రాయితీ లభిస్తుందని ఎంతో ఆశతో మహిళలు రుణాలు తీసుకున్నారన్న ఆయన... కానీ ప్రభుత్వం సకాలంలో వడ్డీ చెల్లించకపోవడంతో వారంతా తీవ్ర నిరాశకు గురయ్యారన్నారు. ఇప్పటికైనా వడ్డీ బకాయిలు చెల్లించి మహిళలను ఆదుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.