లిక్కర్ స్కామ్ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే సీఎం కేసీఆర్ ప్రజాసంగ్రామ యాత్రను అడ్డుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు. లికర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసే దమ్ముందా అని ప్రశ్నించారు. కూతురుకో న్యాయం...? ఇతరులకో న్యాయమా..? అని నిలదీశారు. టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసిన పాదయాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు. పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి టీఆర్ఎస్ కు భయం పట్టుకుందని.. అందుకే అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.
టీఆర్ఎస్ అక్రమాలు ప్రశ్నిస్తుందుకే బీజేపీ శ్రేణులను అరెస్టులు చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. మునుగోడులో టీఆర్ఎస్ అట్టర్ సభ ఫ్లాప్ అయ్యిందన్న ఆయన..బీజేపీ సభకు ప్రజలు స్వచ్చందంగా తరలివచ్చినట్లు తెలిపారు. మునుగోడులో బీజేపీ గెలుస్తుందనే భయం కేసీఆర్ కు పట్టుకుందని.. అందుకే శాంతియుతంగా దీక్ష చేస్తుంటే అడ్డుకున్నారన్నారు. దేవురుప్పలలో మహిళలని కూడా చూడకుండా టీఆర్ఎస్ గూండాలు దాడి చేసి గాయపర్చారని..అయినా తెగించి మహిళలు టీఆర్ఎస్ గూండాల దాడిని తిప్పికొట్టారని చెప్పారు.
తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా? అని దేశమంతా నివ్వెరబోతోందని బండి సంజయ్ మండిపడ్డారు. టీఆర్ఎస్ నాయకులే కేసీఆర్ తీరును అసహ్యించుకుంటున్నారని.. కేసీఆర్ తన స్థాయిని మరిచి వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రజల కోసం ఎన్ని దాడులు అయినా భరిస్తామని..ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం పాదయాత్ర కొనసాగిస్తామని స్పష్టం చేశారు.