నిజాం రజాకార్లను ఎదిరించి జాతీయ జెండా కోసం ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు బత్తిని మొగిలయ్య గౌడ్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం సిరిపురంలో 9వ రోజు పాదయాత్ర ప్రారంభించిన బండి సంజయ్..బత్తిని మొగులయ్యకు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆ రోజుల్లోనే జాతీయ జెండా కోసం ప్రాణా త్యాగం చేసిన వ్యక్తి అని కొనియాడారు. జాతీయ జెండా గొప్పతనం గురించి చెప్పిన మొగిలయ్య జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తి అని..ప్రతి ఆదివారం జాతీయ జెండా ఎగరేసి తన దేశభక్తిని చాటారని తెలిపారు.
300 మంది రజాకార్లను ఉరికించిన వ్యక్తి బత్తిని మొగిలయ్య గౌడ్ అని బండి సంజయ్ అన్నారు. మొగిలయ్య గౌడ్ విరోచిత పోరాటం సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఇటువంటి వీరుల చరిత్రను విద్యార్థులకు పాఠంగా చెప్పాల్సిన అవసరం ఉందన్న ఆయన..బీజేపీ అధికారంలోకి వస్తే ఆయన జీవితచరిత్రను పాఠ్యాంశంగా చేరుస్తామన్నారు.