హైదరాబాద్: నెల రోజులు విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంచి ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఓటర్లకు డబ్బు పంచడానికి టార్గెట్ పెట్టారని చెప్పారు. భవిష్యత్ లో తమకు ఎమ్మెల్యే టికెట్లు వస్తాయో రావో అనే భయంతో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సొంతంగా రూ.1000 కోట్లకు పైగా ఖర్చు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబులెన్స్, పోలీస్ వాహనాల్లోనే టీఆర్ఎస్ నేతలు డబ్బు పంపిణీ చేశారని, వారికి పోలీసులు సహకరించారని మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలు డబ్బు పంచుతున్నారని కంప్లైంట్ ఇస్తే ఎన్నికల సంఘం పట్టించుకోలేదని విమర్శించారు. డబ్బు పంచిన వారిలో మొత్తం 42 మందే దొరికారని ఎన్నికల అధికారులు చెబుతున్నారని అన్నారు.
అసలు ఎన్నికల సంఘం ఉందా లేదా అనే అనుమానం కలుగుతోందని, ఎన్నికల అధికారులు కేసీఆర్ జేబు మనుషులుగా మారిపోయారని ఫైర్ అయ్యారు. ఎన్నికల అధికారుల పక్షపాత వైఖరిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ నాయకులు ఎన్ని ప్రలోభాలకు గురి చేసిన రాజగోపాల్ రెడ్డి అఖండ విజయం సాధించబోతున్నారని సంజయ్ చెప్పారు. రాజగోపాల్ రెడ్డి విజయంతో బీఆర్ఎస్, టీఆర్ఎస్ ఖేల్ ఖతం అని బండి సంజయ్ విమర్శించారు.