రేపు యాదగిరి గుట్టకు బండి సంజయ్

నల్గొండ జిల్లా: మునుగోడు ప్రచారంలో ఉన్న బండి సంజయ్ రేపు (అక్టోబర్ 28) యాదగిరి గుట్టకు వెళ్లనున్నట్లు బీజేపీ నాయకులు ప్రకటించారు. రేపు ఉదయం 9 గంటలకు మునుగోడు నియోజవర్గంలోని మర్రిగూడెం నుంచి బండి సంజయ్ యాదగిరి గుట్టకు వెళ్తారని తెలిపారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తన ప్రమేయం లేదని సీఎం కేసీఆర్ ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ కుట్రలు పన్నిందని టీఆర్ఎస్ నేతలు ఆరోపించడాన్ని బీజేపీ నేతలు సీరియస్ గా తీసుకున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా అంతా సీఎం కేసీఆర్ కనుసన్నల్లలోనే జరిగిందని టీఆర్ఎస్ పై ఎదురు దాడికి దిగారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో గానీ లేకుంటే సీబీఐతో గానీ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే విధంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై విచారణ చేయాలంటూ బీజేపీ నేతలు ఇవాళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ మాట్లాడారు.

మొయినాబాద్ ఫాంహౌజ్ ఘటనకు సీఎం కేసీఆర్ ప్రధాన సూత్రధారి అని ఆరోపించారు. మునుగోడు ఎన్నికలో మునుగోడు బై పోల్ లో గెలిచేందుకు కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రేపు తాను యాదగిరి గుట్టకు వెళ్తున్నానని, దమ్ముంటే అక్కడికి రావాలని కేసీఆర్ కు సవాలు విసిరారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తనకు సంబంధం లేదని కేసీఆర్ భావిస్తే గుట్టకు రావాలని, లేకుంటే ఈ ఘటనకు ఆయనను ప్రధాన సూత్రధారిగా భావించాల్సి ఉంటోందని స్పష్టం చేశారు.