బీఆర్ఎస్ గెలిస్తే మోటర్లకు మీటర్లు పెడ్తరు : బండి సంజయ్

తెలంగాణ రాకముందు సెస్ లాభాల్లో ఉండేదని.. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక నష్టాల్లో నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సెస్ ఎన్నికలకు మండలానికి ఒక మంత్రిని ఇంచార్జ్గా పెట్టారన్నారు.  33 కోట్ల అవినీతి చేసిన వ్యక్తికే అధికార పార్టీ మళ్లీ టికెట్ ఇచ్చిందని ఆరోపించారు. తండ్రి సహకారంతో ఏర్పాటు చేసిన సంస్థకి ఎమ్మెల్యే రమేష్ తూట్లు పొడుస్తున్నాడని విమర్శించారు. పైసలు పంచి, అడ్డదారుల్లో గెలవాలని టీఆర్ఎస్ చూస్తోందని ఆరోపించారు. 

బీజేపి అంటే కేసీఆర్, కేటీఆర్కి భయమని బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ అంటే బందీ పోట్ల రాష్ట్ర సమితి అన్నారు. రాష్ట్రంలో బీజేపీ గెలవగానే..టీఆర్ఎస్ అక్రమాలను వెలికితీస్తామని చెప్పారు. కాంట్రాక్టర్ల కోసమే టెండర్ల ప్రక్రియ జరుగుతోందని ఆరోపించారు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకోవడం మానేశాడని.. అందుకే డిప్రెషన్లో వెళ్లి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

బీఆర్ఎస్ గెలిస్తే విద్యుత్ మోటర్లకి మీటర్లు పెడుతారని బండి సంజయ్ అన్నారు. వేములవాడ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి విస్మరించారని విమర్శించారు. వేములవాడ అభివృద్ధిపై ప్రజలు ఆలోచించాలని సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటిలేటర్ పై ఉందన్నారు. డ్రగ్స్ కేసులో కేటీఆర్ దోస్తులే ఉన్నారని అన్నారు.