టీఆర్ఎస్ నేతల కబ్జాల చిట్టా మా దగ్గర ఉంది : సంజయ్

నిర్మల్/బైంసా, వెలుగు: అవినీతి, అక్రమాలు, అప్పుల ఊబిలో కూరుకుపోయిన కేసీఆర్ ప్రభుత్వం వెంటిలేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కొనసాగుతున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రజలు గుణపాఠం చెప్పి బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. శుక్రవారం ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నిర్మల్ జిల్లా నర్సాపూర్.జి మండల కేంద్రం, నందన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సంజయ్ మాట్లాడారు. ‘‘లిక్కర్, క్యాసినో దందాల్లో కేసీఆర్ కూతురు కవితకు వాటాలు ఉన్నాయి. ఈ విషయంలో ఈడీ నోటీసులు ఇస్తే తెలంగాణ ఎందుకు ఉద్యమించాలి. కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపే అద్భుత దృశ్యం కోసం తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారు’’ అని చెప్పారు. బాసరలోని ట్రిపుల్ ఐటీని మూసివేసే కుట్ర జరుగుతున్నదని, దీని వెనుక కేసీఆర్ హస్తం ఉందని ఆరోపించారు. అందుకే ట్రిపుల్ ఐటీ లో ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా విద్యార్థులను కేసులతో వేధిస్తున్నారని విమర్శించారు.

దళితులపై అక్రమ కేసులు పెట్టిన్రు

కొంతమంది పోలీస్ అధికారులు.. టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులకు వత్తాసు పలుకుతూ బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తున్నారని సంజయ్​ మండిపడ్డారు. ప్రజలను వేధిస్తున్న పోలీస్ అధికారుల జాబితా తమ వద్ద ఉందని, బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నర్సాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దళితులపై అక్రమ కేసులు బనాయించిన పోలీసులపై, మంత్రిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేస్తామని, వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దళిత బంధు అడిగిన పేద దళిత మహిళలపై నాన్ బెయిలబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులు పెట్టించిన వారిని వదిలిపెట్టబోమన్నారు. 

భారీగా భూకబ్జాలు

మంత్రులు, టీఆర్ఎస్ నేతలు భారీగా భూముల కబ్జాలకు పాల్పడుతున్నారని, చిట్టా తమ దగ్గర ఉందని, బీజేపీ అధికారంలోకి రాగానే ఆ భూములను స్వాధీనం చేసుకొని పేదలకు పంచిపెడతామని సంజయ్ చెప్పారు. ‘‘తెలంగాణ కోసం ఉద్యమించిన బీజేపీని సమైక్యాంధ్ర పార్టీ అంటున్న ముఖ్యమంత్రి ఆత్మ విమర్శ చేసుకోవాలి. సమైక్యాంధ్ర పార్టీలతో, మతోన్మాద ఎంఐఎంతో జతకట్టిన కేసీఆర్.. నువ్వా మమ్మల్ని విమర్శించేది” అని ప్రశ్నించారు. 

ఉద్యమకారులంతా బీజేపీలో ఉన్నరు

మంత్రులు, ఎమ్మెల్యేలు తమ ప్రాంతాలకు ఎన్ని కోట్ల నిధులు తెచ్చారో చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు. తాము ప్రజల పక్షాన పోరాడుతామని, కేసీఆర్ ఎన్ని కేసులు పెట్టి ఎంతమందిని జైలుకు పంపినా వెనకాడబోమని స్పష్టం చేశారు. పేదోళ్ల ఆత్మబలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో పెద్దోళ్లు రాజ్యమేలుతున్నారన్నారు. శ్రీకాంతాచారి ఆత్మ బలిదానంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. రుణమాఫీ, జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికి సీఎం వద్ద డబ్బులు లేవని, ఢిల్లీ లిక్కర్ స్కాం, క్యాసినోల్లో మాత్రం కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు డబ్బులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఉద్యోగాలు రాక నిరుద్యోగులు, రుణమాఫీ లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, 27 మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నా సీఎం కేసీఆర్ పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. పంజాబ్ రైతులకు కేసీఆర్ ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని ఎద్దేవా చేశారు. అసలైన ఉద్యమకారులంతా ఇప్పుడు బీజేపీతోనే ఉన్నారన్నారు. ఖమ్మంలో దొంగ దీక్ష చేసిన కేసీఆర్.. ఓ సినిమాలో వేణుమాధవ్ లా సెలైన్ పెట్టుకొని మందు తాగిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు. గంగిడి మనోహర్ రెడ్డి, సోయం బాపూరావు, రమాదేవి, అయ్యన్న గారి భూమయ్య, రావుల రామనాథ్ తదితరులు పాల్గొన్నారు.

దళితబంధు అడిగితే అక్రమ కేసులు పెట్టిన్రు: బరుకుంట చిలుక

దళిత బంధు పథకం ఇవ్వాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కోరితే తనపై అక్రమ కేసులు బనాయించారని నర్సాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.జికి చెందిన బరుకుంట చిలుక వాపోయారు. ‘‘న్యాయంగా నాకు దక్కాల్సిన దళితబంధు పథకం గురించి అడిగితే పోలీసులతో నాపై కేసులు పెట్టి వేధించారు. ఎలాంటి కేసులకు భయపడను. నేను విసిరిన సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స్వీకరించేందుకు మంత్రి జంకుతున్నాడు” అని చెప్పారు. మంత్రిని ఎదిరించేందుకు తాను సిద్ధమేనని, తగ్గేదే లేదని, అవసరమైతే తాను ఇంద్రకరణ్ రెడ్డిపై పోటీ చేస్తానని ప్రకటించారు.