నల్గొండ, వెలుగు: ‘నా భార్య బిడ్డల సాక్షిగా ప్రమాణం చేస్తున్నా..నేనెప్పుడు గొర్ల పథకం పైసలు ఆపాలని లెటర్ రాయలే. దమ్ముంటే కేసీఆర్ఇక్కడికి వచ్చి ప్రమాణం చేస్తావా’ అని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌కుమార్ ప్రశ్నించారు. బుధవారం గట్టుప్పుల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. గొర్ల పైసల సొమ్ము డిపాజిట్ చేసినట్లే చేసి ఫ్రీజ్ చేసిన ఘనుడు కేసీఆర్అని, తాను లెటర్ రాయడం వల్లే ఫ్రీజ్ చేశారంటూ టీఆర్ఎ స్ నేతలు సిగ్గులేకుండా అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ గుంట నక్కల పార్టీ అని, కేసీఆర్ మూర్ఖత్వంతోనే మునుగోడుకు ఉప ఎన్నికలు వచ్చాయన్నారు. వార్వన్సైడ్గానే జరుగుతుందన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సింహం లాంటోడన్నారు.
కేసీఆర్‌కు దమ్ముంటే మునుగోడు అభివృద్ధికి ఏ చేసిండో ప్రజలకు చెప్పాలని సవాల్ విసిరారు. కేసీఆర్ బిడ్డను బతుకమ్మను అంబాసిడర్ చేద్దామనుకుంటే లిక్కర్ అంబాసిడర్ అయ్యిందని, కొడుకు డ్రగ్స్ కు, అల్లుడు లిటిగేషన్ అంబాసిడర్‌గా మారిపోయారని ఎద్దేవా చేశారు. చేనేత నూలు, రంగులపై 50 శాతం సబ్సిడీ ఇస్తానని కేసీఆర్ మాట తప్పిండని, బతుకమ్మ చీరల ఆర్డర్ ఇక్కడి కార్మికులకు ఇవ్వకుండా సూరత్ కు అప్పగించిన దుర్మార్గుడని ఆరోపించారు. చేనేత కార్మికులను ఏనాడు పట్టించుకోని కేసీఆర్ ఎన్నికలు రాగానే చేనేత బంధుతో మరోసారి మోసం చేయాలని చూస్తున్నాడన్నారు. టీఆర్ఎస్ వాళ్లు ఇవ్వబోతున్న డబ్బు, బంగారం.. భూకబ్జాలు, దోపిడీ చేసి సంపాదించినవన్నారు. ఆ డబ్బులతో ఓట్లు కొనేందుకు వస్తున్న నేతలకు బుద్ధి చెప్పాలన్నారు. ఈ సందర్భంగా పోరాడి గట్టుప్పుల్ మండలాన్ని సాధించుకున్న వారికి అభినందనలు తెలిపారు. బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ , మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ మాట్లాడారు.