నల్గొండ జిల్లా: రాష్ట్రంలో కేసీఆర్ అరాచక పాలనకు చరమగీతం పాడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. మునుగోడులో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరఫున బండి సంజయ్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. పలు పథకాల పేరుతో కేసీఆర్ వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఉద్యమ సమయంలో కారు ఈఎమ్ఐ కట్టుకోవడానికి కూడా డబ్బులు లేని కేసీఆర్ ఇవాళ వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబం మొత్తం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పడ్డాక కూడా రైతుల ఆత్మహత్యలు తగ్గలేదని అన్నారు.
మొన్నటి వరకు మునుగోడుపై కేసీఆర్ తీవ్ర వివక్షత చూపారని, ఇప్పుడు బై పోల్ ఉండటంతో డ్రామాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు, మందు, మటన్, గోల్డ్ బిస్కెట్లు పంచుతూ మునుగోడు ఓటర్లను టీఆర్ఎస్ నాయకులు ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఏనాడు మునుగోడులో కనబడని టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు... ఉప ఎన్నిక ఉండటంతో ఇవాళ మునుగోడులో మకాం వేశారని మండిపడ్డారు. ప్రజల కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని, ఆయనను గెలిపించి టీఆర్ఎస్ పాలనను అంతం చేయాలని బండి సంజయ్ కోరారు.