బిడ్డకు లిక్కర్​లో వాటా.. ఇక టీఆర్ఎస్​కు జనం టాటా : బండి సంజయ్

నిర్మల్/భైంసా, వెలుగు: ‘‘టీఆర్ఎస్ అంటే బాప్, బేటా.. బిడ్డకు లిక్కర్​లో వాటా.. ఇక టీఆర్ఎస్​కు జనం చెప్పాలి టాటా” అంటూ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. అన్ని స్కాంలలోనూ కేసీఆర్ కుటుంబం పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. ఒకప్పుడు లోన్​లు కట్టలేని స్థితిలో ఉన్న కేసీఆర్.. ఇప్పుడు లక్షల కోట్లకు ఎలా ఎదిగారని ప్రశ్నించారు. లిక్కర్ స్కాంలో ఇరుక్కున్న కేసీఆర్ బిడ్డ కవిత జైలుకు వెళ్లాల్నా? వద్దా అని ప్రజలను అడిగారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా గురువారం కుంటాల మండలం లింబా(బి), కుంటాల మండల కేంద్రంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తాము వచ్చాక రాష్ట్ర రూపురేఖలనే మార్చేస్తామన్నారు. 

రామరాజ్యం తేవడమే తమ ధ్యేయమన్నారు. భైంసా బహిరంగ సభ సక్సెస్ చూసి సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులు వణుకుతున్నారని అన్నారు. కేసీఆర్ సంగతి తేల్చేందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టినట్లు వెల్లడించారు. భైంసాకు రాకుండా బీజేపీని అడ్డుకునే ప్రయత్నం చేసినా వచ్చామన్నారు. కేసీఆర్​సభలకు పైసలిచ్చినా జనం రావట్లేదని, చప్పట్ల కోసం అడుక్కునే పరిస్థితికి ఆయన దిగజారారన్నారు. కేంద్రంలోని ప్రధాని మోడీ ప్రభుత్వం 2.40 లక్షల ఇండ్లు, రూ. 4 వేల కోట్లు ఇస్తే.. ఆ నిధులను ఏం చేశాడో కేసీఆర్ చెప్పాలని డిమాండ్​ చేశారు.  

తెలంగాణలో రామరాజ్యం తెస్తం 

కులాలు, వర్గాల పేరుతో హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్​ను గద్దె దించేదాకా నిద్రపోమని సంజయ్ అన్నారు. కేసీఆర్ కుటుంబానికి లిక్కర్, డ్రగ్స్, పత్తాల దందాల్లో భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. రైతుబంధు ఇస్తున్నమని అన్ని పథకాలను బంద్ చేసిండన్నారు. మంత్రి కేటీఆర్ మిషన్​భగీరథపై అబద్ధాలు చెప్తున్నారన్నారు. కేసీఆర్ కుటుంబం, మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేల కోట్లకు ఎదుగుతుండగా పేదలు మరింత పేదరికంలోకి జారుతున్నారని చెప్పారు. కేంద్రం ఇస్తున్న నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందన్నారు. ఉచిత విద్య, వైద్యం, డబుల్ బెడ్రూం ఇండ్లు రావాలంటే బీజేపీకి అవకాశం ఇవ్వాలన్నారు.

కేసీఆర్ చేసిన త్యాగమేంది? 

రాష్ట్ర ఉద్యమంలో ఎంతో మంది ఉద్యమకారులు త్యాగం చేస్తే.. నీళ్లు, నిధులు, నియామకాలన్నీ కేసీఆర్ కుటుంబానికే దక్కుతున్నాయని సంజయ్ అన్నారు. శ్రీకాంతాచారిలాంటోళ్ల ప్రాణ త్యాగాలతోనే రాష్ట్రం వచ్చిందన్నారు. పోలీసు కిష్టయ్య రాష్ట్రం కోసం ఆత్మహత్యచేసుకున్న పేద కుటుంబీకుడని, రైలుకు ఎదురెళ్లి జై తెలంగాణ అంటూ ఆత్మబలిదానం చేసుకున్న సుమన్ కూడా పేదోడేనని గుర్తు చేశారు. ఉద్యమంలో కేసీఆర్​ చేసిన త్యాగం ఏమీ లేదన్నారు.