అవినీతిలో తండ్రికి తగ్గ కూతురుగా కవితకు గుర్తింపు : బండి సంజయ్

లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితను కాపాడేందుకు సీఎం కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. అవినీతిలో తండ్రికి తగ్గ కూతురుగా కవిత గుర్తింపు పొందారంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో విధ్వంసం సృష్టించేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని.. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తీసుకురావాలని చూస్తున్నారని మండిపడ్డారు. నిర్మల్ జిల్లా దిమ్మదుర్తిలో నిర్వహించిన అంబేద్కర్ వర్థంతి సభలో ఆయన పాల్గొన్నారు. జీ20 సమావేశానికి సీఎం కేసీఆర్ వెళ్లకపోవడం సిగ్గుచేటన్నారు. 

ప్రధాని నరేంద్రమోడీ అంబేద్కర్ స్ఫూర్తితో దేశాన్ని శక్తివంతంగా మారుస్తున్నారని బండి సంజయ్ అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే వారం రోజుల పాటు అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే తాను ఎంపీ అయ్యానని చెప్పారు. మోడీ ప్రధాని అయ్యాకే పేదోళ్లకు న్యాయం జరుగుతోందని, 12 మంది ఎస్సీ ఎంపీలను కేంద్రమంత్రులు చేసిన ఘనత మోడీకే దక్కుతుందన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్నే మారుస్తాననడం కేసీఆర్ మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు.