మునుగోడు ఉప ఎన్నికల వేళ...సీఎం కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. తెలంగాణ ప్రజలు, మునుగోడు ఓటర్ల తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రశ్నలు సంధించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాలని లేఖలో డిమాండ్ చేశారు.
బండి సంజయ్ సీఎం కేసీఆర్ కు సంధించిన ప్రశ్నలివే..
- 1. తెలంగాణ ఏర్పడ్డ నుంచి మీదే ప్రభుత్వం, మీరే ముఖ్యమంత్రి, తొలిటర్మ్ (2014 – 18) మీ పార్టీకి చెందిన ప్రభాకర్‌రెడ్డే ఎమ్మెల్యే! 8 ఏళ్ల మీ పాలనలో మునుగోడును ఏం అభివృద్ధి చేశారు? చర్చకు సిద్దమా? మీ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డి, మా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో బహిరంగ చర్చను నిర్వహిద్దాం. తేది, వేదిక, సమయం ఖరారు చేయండి! దీనికి మీరు సిద్దమా?
- 2. 2018 మునుగోడులో ఎన్నికల ప్రచారానికి వచ్చిన సందర్భంగా మునుగోడును ఆకుపచ్చ మునుగోడుగా చేసే బాధ్యత మీదని హామీ ఇచ్చారు. ఈ హామీని మీరు నెరవేర్చారా? నెరవేరిస్తే ఉప ఎన్నికల్లో 100 మంది కౌరవులను (మీ పార్టీ ఎమ్మెల్యేలను, మంత్రులను), ‘‘ఎర్రగులాబీలను’’ (మీ దృష్టిలో దబ్బడం, గుండుసూది పార్టీలు) ప్రచారానికి ఎందుకు పంపినట్లు? మీరే ఒక గ్రామానికి ఎందుకు ఇంచార్జ్‌గా ఉన్నారు? వీటికి జవాబు చెప్పండి?
- 3. చౌటుప్పల్‌లో డిగ్రీ కాలేజ్ నెలరోజుల్లో ప్రారంభిస్తానని 2018 ఎన్నికల సందర్భంగా మునుగోడులో మీరు ఇచ్చిన హామీ ఏమైంది? ఇంకా నెలరోజులు పూర్తికాలేదా?
- 4. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఎకరాల సాగునీరు ఇస్తామని 2014 లో ఎన్నికల మ్యానిఫెస్టోలో పేజీ నెం.7 లో మీరు హామీ ఇవ్వడం జరిగింది. ఈ 8 సంవత్సరాల కాలంలో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించారో చెప్పగలరా?
- 5. మీరు కోట్ల రూపాయలతో నిర్మించుకున్న ప్రగతిభవన్ ఖర్చుతో ఒక జిల్లా మొత్తం పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం అయ్యేవి. మీరు మాత్రం కోట్ల రూపాయలతో ఇల్లు నిర్మించుకుంటారు. ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీ ప్రకారం పేదలకు మాత్రం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పటి వరకు నిర్మించలేదు. దీనికి మీ సమాధానం ఏమిటి?
- 6. మునుగోడులో బీసీ సామాజికవర్గానికి చెందిన గౌడ్లు, పద్మశాలీలు, వడ్డెర, యాదవ, ముదిరాజ్, ఇతర బీసీ కులాల వారికి ఎంత మందికి సబ్సిడీ కింద రుణాలు మంజూరు చేశారు? ఈ రుణాల కోసం ఎంత మంది దరఖాస్తు చేశారు? వీటి వివరాలు చెప్పే దమ్ము, ధైర్యం మీకు ఉందా?
- 7. మీ కుటుంబంలో మాత్రం ఐదుగురికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు? 2014 లో మీరు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంతమంది విద్యావంతులైన నిరుద్యోగ యువతకు కొత్తగా ప్రభుత్వ కొలువులు వచ్చాయి. ఈ లెక్కలు మీ వద్ద ఉన్నాయా? ఉంటే ప్రకటించండి?
- 8. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని విద్యావంతులైన నిరుద్యోగ యువతకు రూ.3,016 ల నిరుద్యోగభృతిని ఎంత మందికి ఇచ్చారు? ఈ భృతి పొందడానికి ఎంత మందికి అర్హత ఉంది?
- 9. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష రూపాయల రైతురుణమాఫీని ఎంత మందికి అమలు చేశారు? ఇంకా ఎంతమందికి పెండింగ్ లో ఉంచారు?
- 10. జీఎస్టీకి సంబంధించి కేంద్రప్రభుత్వం నిర్వహించిన అనేక సమావేశాల్లో రాష్ట్రప్రభుత్వ ప్రతినిధులు, మీ సుపుత్రుడు కేటీఆర్ పాల్గొని చేనేత ట్రైనింగ్‌పైన 5శాతం జీఎస్టీకి ఒప్పుకున్న మాట వాస్తవం కాదా? మీరు, మీ సుపుత్రుడు ‘‘డ్రామారావు’’ ఆడుతున్న దొంగనాటకాలను రుజువులతో సహా నిరూపించడానికి మేము సిద్దం. మీరు సిద్దమా? దీనిపైన మీరు, మీ కుమారుడు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో ప్రమాణం చేయడానికి సిద్దమా?
- 11. కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం 40 లక్షల వరకు జీఎస్టీ లేదు. చేనేత కార్మికులపైన మీకు నిజంగా ప్రేమ ఉంటే 20 లక్షలకే రాష్ట్రప్రభుత్వం ఎందుకు జీఎస్టీ విధిస్తోంది? దీనికి మీరు, చేనేత కార్మికులపై కపట ప్రేమ వలకబోస్తున్న ‘‘డ్రామారావు’’ సమాధానం చెప్పాలి?
- 12. చేనేత సహకార సంఘాలకు క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలి?రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ 8 ఏండ్లకాలంలో ఎందుకు ఎన్నికలు నిర్వహించడం లేదు. చేనేత కార్మికుల సంక్షేమంపై మీకు ఉన్న ప్రేమ ఇదేనా?
- 13. పోచంపల్లి చేనేత బజారు స్థలం కబ్బా అయ్యిందని అనేక సంవత్సరాలుగా చేనేత కార్మికులు పోరాడుతున్నారు. దీనిపైన మీకు, మీ సుపుత్రుడు ‘‘డ్రామారావు’’ కు అనేకసార్లు వినతిపత్రాలు ఇచ్చారు. అయినా ఈ సమస్యను పరిష్కరించి కబ్బా స్థలాన్ని వారికి అప్పజెప్పలేదు. ఇదేనా మీకు పద్మశాలీల మీద ఉన్న ప్రేమ?
- 14. చేనేత కార్మికులపై మీ ప్రభుత్వానికి ప్రేమ ఉంటే టెస్కోకు చైర్మన్, డైరెక్టర్ లను ఎందుకు నియమించడం లేదు?
- 15. మీకు నిజం చెప్పకూడదనే శాపం ఏమైనా ఉందా? ఏనాడూ మీరు నిజం చెప్పరు? ప్రతినిత్యం ఝూఠా మాటలతో 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలను వంఛిస్తున్నారు. కనీసం మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగానైనా నిజాలు మాట్లాడి ఇప్పటివరకు మీరు మాట్లాడిన ఝూఠా మాటలకు చెంపలేసుకుని క్షమాపణ చెప్పండి.