- బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ సర్కార్
- రెండో వారంలో రైతు సమస్యలపై ఆందోళనలు చేస్తమని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రైతులకు పెట్టుబడి సాయం పెంచి ఇస్తామని ఎన్నికల్లో ప్రకటించిన కాంగ్రెస్.. సర్కారు ఏర్పడి ఏడాదైనా ఆ హామీ అమలు చేయట్లేదని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి అన్నారు. రైతు భరోసా కోసం అప్లికేషన్లు తీసుకోవాలనే ఆలోచన సరికాదని, ఇదంతా కాలయాలన కోసమేననీ చెప్పారు. సర్కారు ఇచ్చిన హామీల అమలు కోసం ఈ నెల రెండో వారంలో అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మాజీ ఎంపీ బీబీ పాటిల్, ఇతర బీజేపీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు.
ప్రజలను నట్టేట ముంచుతూ విజయోత్సవాల పేరుతో, పత్రికా ప్రకటనలతో సంబురాలు జరుపుకుంటోందని విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ నేతలు, కేసీఆర్ కుటుంబం దోచుకున్నారని, ప్రస్తుతం కాంగ్రెస్ మంత్రులు దోచుకుంటున్నారని ఆరోపించారు. రైతులకు అరకొర మాత్రమే రుణమాఫీ చేశారని, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కాదని.. ప్రజలను మోసం చేసే ప్రభుత్వమని మండిపడ్డారు. రైతు భరోసా పేరిట అనేక రకాల కొర్రీలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, కౌలు రైతులు, రైతు కూలీలను నట్టేట ముంచే ప్రయత్నం చేస్తున్నదని తెలిపారు.
చర్లపల్లి టెర్మినల్ చరిత్రలో నిలిచిపోతుంది
ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా వర్చువల్ గా ఈ నెల 6న చర్లపల్లి టెర్మినల్ ప్రారంభించుకోవడం గర్వకారణమని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో తొలి టెర్మినల్ గా చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల రద్దీని తగ్గించేలా దోహదపడుతూ, ప్రతిరోజు 24 ట్రైన్లు చర్లపల్లి టెర్మినల్ కేంద్రంగా రాకపోకలు సాగించనున్నాయని తెలిపారు. హైదరాబాద్ పారిశ్రామిక రంగం అభివృద్ధికి ఈ టెర్మినల్ మరింత దోహదపడనుందని చెప్పారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో జాతీయ వాదులను గెలిపించుకోవాలి
రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిబద్ధత గల జాతీయవాదులను గెలిపించుకోవాలని కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) డైరీని టీచర్ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డితో కలిసి ఆయన రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ.. చట్టాల రూపకల్పనలో తపస్ భాగస్వామ్యం పెరగాలని కోరారు. జీవో 317 సమస్యల పరిష్కారం, జీతాలు, ఇతర అనేక సమస్యలపై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినట్టు గుర్తుచేశారు. కార్యక్రమంలో తపస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మంతరావు, నవాత్ సురేశ్, ఇతర నేతలు విష్ణువర్ధన్ రెడ్డి, నరేందర్ రావు, పాపిరెడ్డి, ఉష, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.