- పార్టీల మీద కోపంతో పేదల ఇండ్లు కూల్చొద్దు: కిషన్రెడ్డి
- ఇండ్లు కూల్చకుండా అభివృద్ధి చేస్తామంటే నా వేతనం ఇస్త
- బీజేపీ లీడర్లు కూడా శ్రమదానం చేస్తరు
- ఒట్టేసి చెప్తున్న.. గలీజ్ వాసన, దోమల్లేవ్
- నిర్వాసితుల ఇండ్లకు కాపలా ఉంటం
- డ్రైనేజీ సంగతి తేల్చకుండా ఇండ్లు కూల్చడం సరికాదు
- బుల్డోజర్లు ఎక్కిస్తామన్న సీఎం కామెంట్లతో 9 మందిగుండెపోటుతో చనిపోయిన్రు
- హైదరాబాద్‌కు కృష్ణా నీళ్లు తెస్తేసీఎం రేవంత్ ఫొటో మేమే పెట్టుకుంటం
- మూసీ నిద్ర తర్వాత వ్యాఖ్యలు
హైదరాబాద్/అంబర్ పేట, వెలుగు:పేదలపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందని, వారి ఇండ్లను కూల్చేస్తున్నదని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇండ్లు కూల్చకుండా అభివృద్ధి చేస్తామంటే మూసీ పునరుజ్జీవానికి తాము వ్యతిరేకం కాదన్నారు. ప్రాజెక్ట్ కోసం తన వేతనం ఇస్తానని ప్రకటించారు.
పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా శ్రమదానం చేస్తారని తెలిపారు.పార్టీల మీద ఉన్న కోపంతో.. పేదల ఇండ్లకు ఎసరు పెట్టొద్దని సీఎం రేవంత్‌ను ఆయన కోరారు. ‘‘పేదోళ్ల ఇండ్లపై బుల్డోజర్లు ఎక్కిస్తామని రేవంత్ అన్నరు. ఎవరు అడ్డొచ్చినా తొక్కేస్తమని కామెంట్ చేశారు. అప్పటి నుంచి మూసీ పరీవాహక ప్రాంత ప్రజలు భయంతో బతుకుతున్నరు.
ఎప్పుడు బుల్డోజర్లు ఎక్కించి తమ ఇండ్లు కూల్చేస్తారోనని భయపడుతున్నరు. ఒక్క తులసీరామ్నగర్లోనే 9 మంది గుండెపోటుతో చనిపోయిన్రు. పేదల ఇండ్లు కూలగొట్టి మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ చేపడ్తానంటే ఈ ఒక్క టర్మ్ మాత్రమే రేవంత్ సీఎంగా ఉంటడు. అది కూడా ఆ పార్టీ లీడర్లు సహకారిస్తేనే..”అని కిషన్ రెడ్డి అన్నారు.
శనివారం రాత్రి అంబర్‌పేట నియోజకవర్గం తులసీరామ్‌నగర్ కాలనీలోని అంబోజి శంకరమ్మ ఇంట్లో కిషన్ రెడ్డి బస చేశారు. ఆదివారం ఉదయం స్థానికులతో కలిసి టిఫిన్ చేశారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నేను రాత్రంతా ఇక్కడే బస చేసిన.. ఒట్టేసి చెప్తున్న.. నాకైతే ఎక్కడా అపరిశుభ్రంగా అనిపించలే.
గలీజ్ వాసనేమీ రాలేదు. దోమలు కూడా లేవు. వేలాది మంది పేదలకు నిలువ నీడ లేకుండా చేసి మూసీ ప్రక్షాళన చేస్తారా? కోటి మంది డ్రైనేజీ నీళ్లు మూసీలో కలుస్తున్నయ్. దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. సీఎం ముందుగా చేయాల్సిన పని.. కాలుష్య జలాలు మూసీలో కలవకుండా చేయడం’’ అని కిషన్ రెడ్డి సూచించారు.
నిధులు ఎక్కడి నుంచి తెస్తరు?
కృష్ణా నీళ్లు హైదరాబాద్‌కు తీసుకొస్తామన్న సీఎం రేవంత్ ఆలోచన బాగుందని కిషన్ రెడ్డి అన్నారు. పైప్‌లతో కాకుండా.. కృష్ణ నీళ్లను మూసీ నదిలో పారిస్తే ఆయన ఫొటోను పెట్టుకుంటామన్నారు. తామే కాదు.. ఇక్కడున్న బస్తీవాసులంతా రేవంత్ ఫొటో పెట్టుకుంటారని తెలిపారు. మూసీ పునరుజ్జీవానికి లక్షన్నర కోట్ల నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తరని ప్రశ్నించారు.
రిజర్వ్ బ్యాంక్ ఇస్తుందా? అని నిలదీశారు. పేదల ఇండ్ల జోలికి వెళ్లకుండా ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్నారు. నిజాం మాదిరిగానే.. మూసీకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ కట్టి మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎన్ని బుల్డోజర్లు వచ్చినా పేద ప్రజల ఇండ్లకు తాము కాపలాగా ఉంటామని భరోసా కల్పించారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ తన వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారు.
‘‘30 నుంచి 40 ఏండ్లుగా ఇక్కడే ఉంటున్నరు. ఈ పరిస్థితుల్లో ఇండ్లు కూల్చేస్తామంటే వాళ్లంతా ఎక్కడికిపోవాలి? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజాపాలన ఉంటదన్నరు. కానీ.. పేదల ఇండ్లను కూల్చే కార్యక్రమం చేపడ్తారని ఎవరూ అనుకోలేదు. పేదల ఇండ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ ఒక్క కాలనీలోనూ శంకుస్థాపన చేయలేదు. కానీ.. మూసీ పరీవాహక ప్రాంతంలో మాత్రం ఇండ్లు కూల్చేస్తున్నది. పేదల ఇండ్లు కూల్చేసి మూసీ సుందరీకరణ చేయడం ఏంది?’’అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
కాంగ్రెస్ లీడర్లు ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దు
పేద ప్రజలకు తాము భరోసా కల్పిస్తుంటే.. కాంగ్రెస్ లీడర్లు ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ‘‘పేదల కోసం ఎన్ని తిట్లయినా పడ్తం.. విమర్శలు ముఖ్యం కాదు.. పేద ప్రజలకు అండగా నిలబడటమే మా లక్ష్యం. రేవంత్ రెడ్డి మళ్లీ సీఎం కాలేడు. దేశ వ్యతిరేకులు, సంఘ విద్రోహ శక్తులపై బుల్డోజర్ ఎక్కించాలి.
పేదల ఇండ్లు కూల్చకుండా.. మూసీ పునరుజ్జీవం చేస్తే.. బీజేపీ లీడర్లు కూడా శ్రమదానం చేస్తరు. ప్రజలను ఒప్పించి సుందరీకరణ పనులు చేపట్టాలి. మూసీ బాధితులను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కలవాలి’’అని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
కొబ్బరి నీళ్లు పారిస్తామన్న కేసీఆర్ ఏం చేయలేదు
మూసీలో కొబ్బరి నీళ్లు పారేలా చేస్తామని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు ఫామ్‌హౌస్‌కు పరిమితం అయ్యారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ట్యాంక్‌బండ్ చుట్టూ ఆకాశాన్ని తాకేలా బిల్డింగ్లు నిర్మిస్తామని చెప్పి.. గ్రాఫిక్స్ చూపించారని విమర్శించారు. పదేండ్ల కాలంలో కనీసం ట్యాంక్‌బండ్‌ను కూడా ప్రక్షాళన చేయలేదన్నారు. ‘‘ట్యాంక్‌బండ్ సుందరీకరణ చేసి కాలుష్యాన్ని తొలగిస్తామని కేసీఆర్ అన్నరు.
పదేండ్లు అధికారంలో ఉండి ఏమీ చేయలేదు. అధికారంలోకి వచ్చేందుకు 6 గ్యారంటీలు ప్రకటించిన కాంగ్రెస్.. ఏడాదైనా వాటిని అమలు చేయకుండా తప్పించుకుని తిరుగుతున్నది. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మాత్రం గ్యారంటీలు అమలు చేశామని అబద్ధాలు చెప్తున్నది’’ అని కిషన్ రెడ్డి మండిపడ్డారు.