- బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ
బాన్సువాడ, వెలుగు : ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి అధికారాన్ని అందిపుచ్చుకొనేంత బలాన్ని ఇచ్చారని బీజేపీ బాన్సువాడ అభ్యర్థి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. సోమవారం ఆయన బాన్సువాడలోని పార్టీ ఆఫీస్లో విలేకరులతో మాట్లాడారు. బీజేపీని ముందుకెళ్లని ప్రజలు స్ఫూర్తినిచ్చారని, పెరిగిన తమ బలం ద్వారా ప్రజల కోసం పోరాటం చేస్తామన్నారు. బాన్సువాడలో భారీగా ఓట్లు పెరిగాయని, రాష్ట్రంలోనూ అనేక నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారన్నారు.
పార్టీ కార్యకర్తలకు రక్షణ కవచంలా ఉంటానని, పార్టీ ఆదేశిస్తే ఎక్కడైనా పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. దేశంలోని మూడు రాష్ట్రాల్లోనూ పార్టీ మంచి మెజార్టీ సాధించిందని, తెలంగాణలో వచ్చిన ఫలితాలను సమీక్షించుకుంటామన్నారు. నిజామాబాద్ లో తాను రెండు సార్లు పీసీసీ అధ్యక్షుడిని ఓడిస్తే, కామారెడ్డిలో తమ పార్టీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి పీసీసీ అధ్యక్షుడిని, సీఎంని ఒకేసారి ఓడించారన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పాలనలో మత ఘర్షణలు, దౌర్జన్యాలు, అల్లర్లు జరుగుతాయన్నారు. ప్రజలు స్పష్టంగా మార్పు కోరుకున్నారని, అది కాంగ్రెస్ కు లాభించిందన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు పైడిమల్ లక్ష్మీనారాయణ, గుడుగుట్ల శ్రీనివాస్, చీదరి సాయిలు, కోణాల గంగారెడ్డి, రాజాసింగ్, హన్మండ్లు యాదవ్, పుల్కల్ సాయిలు, ముత్యాల సాయిబాబా పాల్గొన్నారు.