సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీశ్ రెడ్డి అవినీతిపరులు, అక్రమార్కులు, భూ కబ్జాదారులను పెంచి పోషించారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్ రావు ఆరోపించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా శుక్రవారం సూర్యాపేట మండలం కేసారం, కుసుమవారి గూడెం, రాయినిగూడెం, టేకుమట్ల, ఎండ్లపల్లి, హనుమ తండా, రామారం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి జగదీశ్ రెడ్డి సంక్షేమ పథకాల పేరుతో జిల్లా ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు ఆయన అనుచరులు, బీఆర్ఎస్ నాయకులకు మాత్రమే ప్రభుత్వ పథకాలు వచ్చాయన్నారు. 2009 నుంచి ఇప్పటి వరకు వరకు జిల్లాలో జరుగుతున్న అక్రమాలు, అవినీతిపై నిరంతరం పోరాటం చేస్తున్న తనకు అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు.
అధికారంలోకి వస్తే పేదలకు విద్య, వైద్యంతో పాటు రైతులకు ఎకరాకు రెండు బస్తాల కాంప్లెక్స్ ఎరువులు, రెండు బస్తాల యూరియా ఉచితంగా అందజేస్తానని మాటిచ్చారు. సూర్యాపేట జిల్లా ప్రజల చిరకాల కోరిక అయిన హైదరాబాద్ , విజయవాడ రైల్వే మార్గం తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు వెన్న శశిధర్ రెడ్డి, నాయకులు వెన్న చంద్రారెడ్డి ,ఉప్పు శ్రీనివాస్, జ్యోతుల యుగేందర్, గుడిసే వెంకన్న, కస్పరాజు శ్రీను, చింత లింగయ్య, సంగు గోవిందమ్మ ,పలస వెంకన్న, ముక్కముల ఎల్లయ్య, మొండి కత్తి శివాజీ, బోర రమేష్ యాదవ్, మామిడి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.