- బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీ నారాయణ
- కామారెడ్డిలో నిరసన
కామారెడ్డి టౌన్, వెలుగు: ప్రజాస్వామ్యానికి 1975 జూన్ 25వ తేదీ చీకటి రోజని బీజేపీ రాష్ర్ట ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మినారాయణ అన్నారు. దేశంలో 1975 నుంచి 1977 వరకు 21 నెలల పాటు అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారన్నారు. జూన్ 25వ తేదీ మంగళశారం తో 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీటింగ్ లో ఆయన మాట్లాడారు.
మున్సిపల్ కార్యాలయం వద్ద గల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు నల్ల రిబ్బన్ లతో నిరసన చేపట్టారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన వీరులను, ఉద్యమకారులను యెండెల స్మరించుకున్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ ప్రత్యర్థులను జైలుపాలు చేశారన్నారు. వాస్తవాలను చెప్పేందుకు ప్రయత్నించిన పత్రికలపై తీవ్ర నిర్బంధం విధించారన్నారు. ప్రశ్నించే మేధావులు, పాత్రికేయుల గొంతునొక్కారని, ఎన్నో సంస్థలను రద్దు చేశారని విమర్శించారు. భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను తుంగలో తొక్కారని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు విపుల్, ప్రధాన కార్యదర్శులు నరేందర్ రెడ్డి, రవీందర్ రావు, నాయకులు భరత్, శ్రీకాంత్, చారి బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.