కాంగ్రెస్​ ఎజెండా ఫిరాయింపులే..రాష్ట్రంలో బీజేపీనే ప్రత్యామ్నాయం : కిషన్​రెడ్డి

  • ఎమ్మెల్యేలను కాంగ్రెస్​లోకి  కేసీఆరే పంపుతుండు : సంజయ్ 
  • కేసుల నుంచి బయటపడేందుకు ఇదంతా చేస్తున్నడని కామెంట్​
  • శంషాబాద్​లో బీజేపీరాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం 
  • 15 అంశాలతో పార్టీ రాజకీయ తీర్మానం

హైదరాబాద్, వెలుగు : రాజకీయ ఫిరాయింపులే ఎజెండాగా రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం పనిచేస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని దోచుకోవడమే కాంగ్రెస్ సర్కారు ​ప్రధాన లక్ష్యం అని ఆరోపించారు. గత బీఆర్ఎస్ సర్కారు మాదిరిగానే కాంగ్రెస్ కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నదని విమర్శించారు. శుక్రవారం శంషాబాద్​లో బీజేపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ, లోక్​సభ ఎన్నికల్లో 8 చొప్పున సీట్లు అందించిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ సర్కారు అనేక ఇబ్బందులు, చిత్రహింసలు పెట్టినా.. నియంత పాలనపై పోరాటం చేశారని చెప్పారు. పదేండ్లు పాలించిన బీఆర్ఎస్​కు ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటూ రాలేదని అన్నారు. రాష్ట్రంలో 46 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, 44 స్థానాల్లో రెండోస్థానంలో నిలిచినట్టు గుర్తుచేశారు.

దీని ద్వారా కాంగ్రెస్​కు బీజేపీయే ప్రత్యామ్నాయం అని ప్రజలు తీర్పునిచ్చారని వెల్లడించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ మారితే డిస్ క్వాలిఫై చేయాలని రాహుల్ గాంధీ పెట్టిన ఎజెండాను తుంగలో తొక్కి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా కాంగ్రెస్​లో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ గ్యారంటీల వైఫల్యాలపై ప్రతి బీజేపీ కార్యకర్త కాంగ్రెస్ నేతలను నిలదీయాలని పిలుపునిచ్చారు. 

బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే : బండి సంజయ్​

బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలను కాంగ్రెస్​లోకి కేసీఆరే పంపిస్తున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ప్రజల ఆలోచనా విధానం మారిపోయిందని, బీఆర్ఎస్​, కాంగ్రెస్ ఒక్కటేనని వారికి అర్థమైందని  అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే వారి అవినీతి బండారం బయట పడుతుందని ఆ రెండు పార్టీలు భయపడి ఒక్కటయ్యాయని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిరుద్యోగం అంటువ్యాధిలా వ్యాపిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని,  రాహుల్ కు దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటీలో తిరగాలని సవాల్ విసిరారు.

మూడోసారి మోదీ ప్రభుత్వానికి అవకాశమిచ్చిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని బండి సంజయ్ ప్రవేశపెట్టారు. తెలంగాణలో రామరాజ్యం, మోదీ రాజ్యం రావాలని ప్రజలు బీజేపీకి పట్టం కడుతున్నారని వెల్లడించారు. బీజేపీ కార్యకర్తలు చేసిన పోరాటాలు మరువలేనివని, ఎన్ని కేసులైనా తెగించి కొట్లాడారని ఆయన చెప్పారు.  బీజేపీ శ్రేణులు భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో తెలంగాణలో ఏమీ మారలేదని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు.  ఎమ్మెల్యే రాజాసింగ్​ మాట్లాడారు.

సామాన్య కార్తకర్తకే సీఎం అయ్యే చాన్స్ ​: ధర్మేంద్ర ప్రధాన్​

బీజేపీలో కొత్త, పాత ఏమీలేదని, పార్టీలో చేరిన వారందరూ పాత వారేనని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఈటల రాజేందర్​ పార్టీకి కొత్త కాదని, ఆయన పాతపడిపోయాడని చెప్పారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో సామాన్య కార్యకర్త సీఎం అయ్యే అవకాశాలున్నాయని స్పష్టం చేశారు. గత పదేండ్లలో ఒక కుటుంబం రాష్ట్రాన్ని నాశనం చేసిందని కేసీఆర్​కు పరోక్షంగా చురకలంటించారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉన్నదని చెప్పారు. సమావేశంలో బీజేపీ సంస్థాగత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి

ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, నేతలు ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు, ఎంపీలు నేతలు పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు హామీల విస్మరణపై ఫైట్ చేయాలని కాషాయ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 15 అంశాలతో కూడిన రాజకీయ తీర్మానాన్ని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రవేశపెట్టగా.. ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు బలపరిచారు.

రుణమాఫీ, పంటసాయంపై నిలదీద్దాం

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై అసెంబ్లీలో నిలదీయాలని బీజేపీ శాసనసభాపక్షం నిర్ణయించింది. శుక్రవారం అసెంబ్లీ హాల్​లో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. త్వరలో జరిగే బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఎమ్మెల్యేలు రాజాసింగ్, రాకేశ్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, రామారావు పటేల్, పాయల్ శంకర్, పాల్వాయి హరీశ్, ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, తదితరులు పాల్గొన్నారు.