
తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆల్ పార్టీ మీటింగ్కు బీజేపీ దూరంగా ఉంటున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఎంపీల సమావేశానికి హాజరు కాలేమని డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్కకు లేఖ రాశారు.
తమకు ఆహ్వానం ఆలస్యంగా అందిందని, చర్చించుకునే సమయం లేనందున రాలేకపోతున్నామని లేఖ ద్వారా తెలిపారు. ఈ సారైనా ముందుగా సమాచారం అందించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.
మహిళా దినోత్సవం కారణంగా ఎంపీలందరికీ నియోజకవర్గాల్లో పలు కార్యక్రమాలు ఉన్నందున తమ పార్టీ ఎంపీలు మీటింగ్ హాజరు కావడానికి వీలు కాదని తెలిపారు. ముందుగా నిర్ణయించిన అధికార, అనధికారిక కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉన్నందున వీలుకాదని తెలిపారు. ఇటువంటి సమావేశాలకు ముందుగా సమాచారం అందిస్తే బాగుంటుందని సూచించారు.
కేంద్ర ప్రభుత్వం వద్ద రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న నిధులు, సమస్యల పరిష్కారానికి రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన శనివారం (మార్చి 8) ఉదయం 11 గంటలకు ప్రజాభవన్ లో అన్ని పార్టీల ఎంపీల మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం వద్ద అపరిష్కృతంగా ఉన్న రాష్ట్ర సమస్యలపై చర్చించనున్నారు.
పెండింగ్‌లో ఉన్న సమస్యలపై ఎంపీలు పార్లమెంట్‌లో, కేంద్ర ప్రభుత్వం వద్ద మాట్లాడాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తున్నట్లు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లతో పాటు రాష్ట్ర ఎంపీలందరిని శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి స్వయంగా ఫోన్ చేసి సమావేశానికి ఆహ్వానించారు. అయితే సమాచారం ఆలస్యంగా అందిందని, కొన్ని అనివార్య కారణాల వలన బీజేపీ ఆల్ పార్టీ మీటింగ్ కు దూరంగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి లేఖ ద్వారా తెలిపారు.