మునుగోడు: తుగ్లక్ నిర్ణయాలతో కేసీఆర్ రాష్ట్రాన్ని ఆగం చేశారని మునుగోడు బైపోల్ బీజేపీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. మునుగోడు బీజేపీ క్యాంప్ ఆఫీస్ లో మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డితో కలిసి వివేక్ వెంకటస్వామి మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ ప్రజలను మరిచిపోయారని చెప్పారు. కల్వకుంట్ల కుటుంబాన్ని బంగారం చేసేందుకే కేసీఆర్ పనిచేస్తున్నారు తప్ప ప్రజలకు ఆయన చేసిందేమీ లేదని విమర్శించారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేశారని, తన కుటుంబానికి చెందిన ఆరుగురికి మాత్రం పదవులు ఇచ్చారని కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని ఆయన ఇంత వరకు అమలు చేయలేదని ఫైర్ అయ్యారు. రైతులకు ఫ్రీ ఫెర్టిలైజర్స్, ఉచిత విద్య, దళితులకు మూడెకరాలు ఏమయ్యాయని వివేక్ ప్రశ్నించారు.
ప్రతి నియోజకవర్గంలో 100 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేస్తామన్న కేసీఆర్ మాట తప్పారని వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. భగీరథ పథకం విషయంలో టీఆర్ఎస్ నాయకులు చెప్పేవన్నీ అబద్ధాలేనని అని అన్నారు. కేసీఆర్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని, పోలీసులను వాడుకుంటూ ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఎన్ని కుట్రలు పన్నినా మునుగోడులో గెలిచేది బీజేపీనే అన్నారు. కేసీఆర్కు పోయే కాలం దగ్గర పడ్డదని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ప్రజలు చిత్తుగా ఓడిస్తారని వివేక్ వెంకటస్వామి చెప్పారు.