నల్గొండ జిల్లా: రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులను తెరిచి గౌడన్నల పొట్టగొట్టారని మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. బీజేపీ ఆధ్వర్యంలో చౌటుప్పల్ లో జరిగిన గౌడ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని గౌడన్నలకు టీఆర్ఎస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. ప్రమాదవశాత్తు ఎందరో గౌడ కార్మికులు తాటి చెట్లపై నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోతున్నారని, చాలా మంది అంగవైకల్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు దాటుతున్నా.. ఇప్పటికీ గౌడ కార్మికులకు ఇన్సూరెన్స్ కార్డులు ఇవ్వలేదని మండిపడ్డారు.
గౌడ కార్మికులకు మోపెడ్ లు, హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కేసీఆర్ అవినీతి, అహంకార పాలనకు మునుగోడులో రాజగోపాల్ రెడ్డి విజయంతో చెక్ పెట్టాలని రాష్ట్ర ప్రజలను కోరారు. బీజేపీ పాలనలో గౌడ కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటామని వివేక్ హామీ ఇచ్చారు.