న్యూఢిల్లీ: రాజ్యసభలో బీజేపీ సంఖ్యా బలం తగ్గిపోయింది. నామినేటెడ్ సభ్యులు రాకేశ్ సిన్హా, రామ్ షకల్, సోనాల్ మాన్‌సింగ్, మహేశ్ జెఠ్మలానీ పదవీకాలం శనివారం పూర్తయింది. దీంతో బీజేపీ బలం 86కి, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్డీయే) బలం 101కి పడిపోయింది. ప్రస్తుతం పెద్దల సభలో 225 మంది సభ్యులు ఉన్నారు. అంటే మెజారిటీ మార్క్ 113.. కానీ ఎన్డీయే సభ్యుల సంఖ్య కేవలం 101 మాత్రమే.
ఎన్డీయేకు ఏడుగురు నామినేటెడ్ ఎంపీలు, ఒక స్వతంత్ర ఎంపీ మద్దతున్నప్పటికీ మెజార్టీ మార్క్ దాటదు. అలాగే, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి 87 మంది సభ్యులు ఉన్నారు. అందులో కాంగ్రెస్‌కు 26, తృణమూల్ కాంగ్రెస్ కు 13, ఆమ్ ఆద్మీ పార్టీకి 10, డీఎంకేకు 10 చొప్పున ఉన్నాయి. మిగిలిన వాటిని బీజేపీ లేదా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోని పార్టీలు, నామినేటెడ్ ఎంపీలు, స్వతంత్రులు కలిగి ఉన్నారు.
కాగా, గతంలో ఏపీ, ఒడిశాలలో అధికారంలో ఉన్న వైసీపీ, బీజేడీ పార్టీలు కేంద్రంలో ఎన్డీయే కూటమికి మద్దతుగా ఉండేవి. ప్రస్తుతం ఆ రెండు పార్టీలకు చెందిన రాజ్యసభ సభ్యులు కూడా ఎన్డీయే కూటమికి మద్దతు పలికే పరిస్థితి లేదు. కాగా, ప్రస్తుతం రాజ్యసభలో 19 ఖాళీలు ఉన్నాయి. 4 జమ్మూ కాశ్మీర్ నుంచి, 4 నామినేటెడ్ పోస్టులు, ఈ సంవత్సరం ఎన్నికలు జరగాల్సిన 11 ఖాళీ స్థానాలు ఇందులో ఉన్నాయి.
వీటికి ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇదే పరిస్థితి కొనసాగనుంది. మహారాష్ట్ర, అస్సాం, బీహార్ లో రెండు, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, త్రిపురలో ఒక్కొక్క స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో కనీసం 8 స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని అంచనా.