జిహెచ్ఎంసీ ఎన్నికల ఖర్చు కోసమేనని బీజేపీ నేతల ఆరోపణ
హైదరాబాద్: ఎల్ఆర్ఎస్ పథకాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు ఆందోళనబాట పట్టారు. జిహెచ్ఎంసీ ఎన్నికల ఖర్చు కోసమే టిఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ తీసుకువచ్చిందంటూ హయత్ నగర్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి మాట్లాడుతూ… దుక్కి దున్ని బ్రతికే రైతన్న ఉండే పల్లెల్లో ఎల్ఆర్ఎస్ కట్టమంటే ఎలా.. ? దీన్ని టీఆర్ఎస్ దోపిడీ అనరా…? అని ప్రశ్నించారు. ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోని ప్రభుత్వం ప్రజల్లో సంక్షోభం సృష్టిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. జి.ఓ 131 తో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తు ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. ఎల్ఆర్ఎస్ ను వెంటనే రద్దు చేసి అది లేకుండానే ప్లాట్లు రిజిస్టేషన్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వక్ర బుద్ది మానుకొని ప్రజలను పీడించడం మానుకోవాలని.. ప్రజల సంక్షేమం కోసం పథకాలు తీసుకురావాలని అన్నారు. ప్రభుత్వానికి ఎల్ఆర్ఎస్ వసూల్ పై ఉన్న శ్రద్ధ పేద ప్రజలకు ఇచ్చే డబుల్ బెడ్ రూంపైన లేదన్నారు. ఫర్మిషన్ లేకుండా జరిగిన లే అవుట్లపై అప్పుడు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.