మూడో అడుగు ఓరుగల్లే
దుబ్బాక, హైదరాబాద్‌లో మొదటి రెండడుగులు పడ్డయ్
వరంగల్, జనగామ, సూర్యాపేట టూర్లో కిషన్‌రెడ్డి
మోడీది అవినీతి లేని పాలన.. కేసీఆర్‌ది వేల కోట్ల అవినీతి
చరణ్జోషి, స్వామినాథన్ కమిషన్ల సిఫార్సులతోనే అగ్రి చట్టాలు
ఎన్నడూ లేనంతగా కనీస మద్దతు ధరను ఇస్తం
వరంగల్/జనగామ/తుంగతుర్తి, వెలుగు: ప్రధాని నరేంద్ర మోడీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పాలన చేస్తుంటే.. రాష్ట్రంలో సీఎం మాత్రం ఒక్క రోజు కూడా సెక్రటేరియట్‌కు రాకుండా పాలన సాగిస్తున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. కేంద్రంలో అవినీతి రహిత పాలన నడుస్తోందని, సీఎం కేసీఆర్ మాత్రం వేలాది కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. శుక్రవారం ఆయన వరంగల్, జనగామతో పాటు సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలంలో పర్యటించారు. హన్మకొండలో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో మజ్లిస్ లేకపోతే టీఆర్ఎస్కు పుట్టగతులు లేవని ఆయన విమర్శించారు. వరంగల్‌లో కాషాయ జెండా ఎగరాలని అన్నారు. ఇప్పటికే దుబ్బాకలో మొదటి అడుగు, హైదరాబాద్‌లో రెండో అడుగు పడ్డాయన్నారు. మూడో అడుగు వరంగల్ ప్రజలు వేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్, కేటీఆర్, ఒవైసీ ఏం చేసినా 2023లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పాలనపై పోరాడినట్టే.. ఇక్కడా పోరాడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వరంగల్‌లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలన్నారు.
రైతుల కోసమే అగ్రిచట్టాలు
రైతుల బాగు కోసమే కేంద్ర ప్రభుత్వం అగ్రి చట్టాలు చేసిందని కిషన్ రెడ్డి అన్నారు. అర్వపల్లిలోని షిర్డి సాయిబాబా ఆలయంలో దర్శనం చేసుకున్న తర్వాత ఆయన మాట్లాడారు. రైతులు తమ పంటను నచ్చిన ప్రాంతంలో, నచ్చిన ధరలకు అమ్ముకునే విధంగా గతంలో చరణ్జోషి, స్వామినాథన్ కమిషన్లు సిఫార్సు చేశాయని, వాటికి అనుగుణంగానే చట్టాలు చేశారని వివరించారు. కొందరు నేతలు సొంత ప్రయోజనాల కోసం ఎంఎస్పీని ఎత్తేస్తారని, మార్కెట్ యార్డులను రద్దు చేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎంఎస్పీని ఎక్కువ ఇస్తామన్నారు. పంజాబ్‌లో తప్ప ఎక్కడా వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించట్లేదన్నారు. ప్రతి కుటుంబానికి ఏటా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆయుష్మాన్ భారత్ స్కీంను రాష్ట్రంలో అమలు చేయకుండా సీఎం కేసీఆర్ అడ్డుకున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ప్రధాని మోడీకి పేరొస్తుందన్న ఉద్దేశంతోనే స్కీంను అమలు చేయట్లేదన్నారు.
ఇటీవల చనిపోయిన నోముల నర్సింహయ్యకు కిషన్‌రెడ్డి నివాళులర్పించారు. నల్గొండ జిల్లా నకిరేకల్‌లో నోముల నర్సింహయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. సిద్ధాంతపరంగా పార్టీలు వేరైనప్పటికీ శాసనసభలో కలిసి గళం విప్పేవాళ్లమని కిషన్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. నర్సింహయ్య
ధైర్యవంతుడన్నారు.
వరంగల్‌లో వరద సాయమేదీ?
వరదలతో అతలాకుతలమైన హైదరాబాద్‌లో 7 లక్షల మందికి రూ.10 వేల చొప్పున సాయం చేసినట్టు సీఎం కేసీఆర్ చెబుతున్నారని, మరి, వరంగల్‌లో పరిహారం ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. వరంగల్ ప్రజలు తెలంగాణ బిడ్డలు కాదా అని ప్రశ్నించారు. వరంగల్‌తో పాటు రాష్ట్రంలో వరదతో నష్టపోయిన ప్రతి ఇంటికీ రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని సర్కారును డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో అన్ని ఇండ్లకు సాయం అందకముందే మధ్యలో ఆపేసి ఆదరాబాదరాగా ఎన్నికలు పెట్టారని మండిపడ్డారు. బీజేపీకి టైం ఇవ్వొద్దన్న ఉద్దేశంతోనే ఎన్నికలు పెట్టారని, కానీ, టీఆర్ఎస్ బొక్కబోర్లా పడిందని విమర్శించారు. సిద్దిపేటలో టీఆర్ఎస్ కోటలు బీటలు వారడంతోనే సీఎం కేసీఆర్ వైఖరి మారినట్టుందన్నారు.
For More News..