
హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్సీగా తనను గెలిపిస్తే టీచర్లు, లెక్చరర్ల సమస్యలపై శాసనమండలిలో గళమెత్తుతానని బీజేపీ కరీంనగర్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – మెదక్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో పలు టీచర్ల సంఘాల సభ్యులు ఆయనను కలిసి పెండింగ్ డీఏలు, పీఆర్సీ, మెడికల్ బిల్లులు, ఇతర బకాయిల విడుదలకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జులై 2023 నుంచి అమల్లోకి రావాల్సిన కొత్త పీఆర్సీపై అమలుపై ప్రభుత్వం ఇప్పటి వరకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఎమ్మెల్సీగా తనను గెలిపిస్తే మండలిలో టీచర్ల సమస్యలపై సర్కారుతో పోరాడుతానని హామీ ఇచ్చారు. సర్కారు టీచర్లకు సంబంధించిన జీపీఎఫ్ లోన్లు, పార్ట్ ఫైనల్స్, సరెండర్ లీవ్ బిల్లులు, మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే వాటిని రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించడంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని మండిపడ్డారు.
పలు సంఘాల మద్దతు
మల్క కొమరయ్యకు టీఎస్సీఎస్టీయూఎస్, టీటీయూ సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఈ మేరకు తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కిషన్ నాయక్, గిరిమల్ల చిట్టిబాబు, తెలంగాణ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మణిపాల్ రెడ్డి, పోలంపెల్లి ఆదర్శన్ రెడ్డి ఆయనను కలిసి మద్దతు లేఖలు అందించారు.