దత్తత పేరుతో దగా చేయాలని చూస్తుండ్రు: బండి సంజయ్

మునుగోడు: ప్రజలను ఆదుకునే వ్యక్తి కావాలా లేక ముంచేటోడు కావాలా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. మునుగోడు ఎన్నికల స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామితో కలిసి బండి సంజయ్ మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలంలోని ఎస్ లింగోటంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిత్యం అందుబాటులో ఉంటూ  ప్రజల సమస్యలను తీర్చే వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని చెప్పారు. ఆపదలో ఉన్న వాళ్లను ఆదుకునే నైజం రాజగోపాల్ రెడ్డి సొంతమని తెలిపారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో టీఆర్ఎస్ నేతల్లో భయం మొదలైందని, అందుకే టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు మునుగోడులో మకాం వేశారని విమర్శించారు.

దత్తత పేరుతో ప్రజలను దగా చేయడానికి టీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల కోసం రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డిని తిరిగి ఎమ్మెల్యే పదవిలో కూర్చోబెట్టాలని, అందుకోసం బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గంగిడి మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తదితరులు ఉన్నారు.