ప్రధానిగా మూడోసారి మోదీ ఇవాళ రాత్రి ప్రమాణస్వీకారం చేయనున్నారు. మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి మరోసారి కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
సికింద్రాబాద్ ప్రజలు, మోదీ ఆశీస్సులతో మరోసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నా. నాపై నమ్మకం ఉంచిన ప్రధాని, జేపీ నడ్డా, సీనియర్ నేతలకు కృతజ్ఞతలు. నా శ్రేయోభిలాషుల మద్దతు కొనసాగుతుందని ఆశిస్తున్నా అని కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.
కిషన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం
కిషన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ లో జన్మించారు. సంఘ్ కార్యకర్త అయిన కిషన్ రెడ్డి 1977లో జనతా పార్టీలో చేరారు. 1980లో రంగారెడ్డి జిల్లా బీజేపీ యువమోర్చా కన్వీనర్ గా బాధ్యతలు చేపట్టారు. 2001లో బీజేపీ రాష్ట్ర కోశాధికారిగా, 2004లో యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా చేశారు. 2004లో హిమాయత్ సాగర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2009, 14లో అంబర్‌పేట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2010లో బీజేపీ ఉమ్మడి ఏపీ అధ్యక్షుడిగా ఎన్నియకయ్యారు. 2014లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు.2014 లో అంబర్ పేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
2018లో అంబర్ పేట నుంచి ఎమ్మెల్యేగా ఓటమిపాలయ్యారు. 2019లో సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2021లో కేబినెట్ విస్తరణలో భాగంగా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా నియమితులయ్యారు.