ఖాయా.. పీయా.. చలేగయా.. ఇట్లుండే కేసీఆర్ కుటుంబ పాలన: కిషన్ రెడ్డి

  • రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా 
  • బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభం  
  • ప్రజలు మోదీనే కావాలనుకుంటున్నరు: రూపాలా 
  • కాంగ్రెస్​కు దేశవ్యాప్తంగా 30 సీట్లు కూడా రావు: హిమంత 
  • బీఆర్​ఎస్​, బీజేపీ పొత్తు అనేటోళ్లను చెప్పుతో కొట్టాలె: సంజయ్

భైంసా / యాదాద్రి / మక్తల్ / నర్వ / మాగనూరు /ఊట్కూరు / వికారాబాద్, వెలుగు:  రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన తీరు ‘ఖాయా, పీయా, చలేగయా..’ అన్నట్లుగా ఉండేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని.. ఆ రెండూ కుటుంబ పార్టీలేనన్నారు. ఆ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉందని, మోసపూరిత హామీలతో జనాల్ని మోసం చేస్తున్నాయన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధాని మోదీ పాలనే కావాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని చెప్పారు. మంగళవారం నారాయణపేట జిల్లా కృష్ణ మండల కేంద్రంలో ప్రత్యేక పూజలు చేసి బీజేపీ విజయ సంకల్ప యాత్రను కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 

‘‘బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ కుటుంబ పార్టీలే.. పాలమూరు జిల్లా అభివృద్ధి కావాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి. అధికారంలోకి రాగానే కరెంట్ బిల్లులు, రైతు రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు వంద రోజులు అంటూ మాట మారుస్తున్నది’’అని మండిపడ్డారు. రాష్ర్టాన్ని దోచుకునేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని, అందుకే ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ మరోసారి రాష్ర్టానికి వస్తున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో కుల మతాల గొడవలు పెరిగేవని.. పాకిస్తాన్ ఏజెంట్లు రెచ్చిపోయేవారన్నారు. దేశ సరిహద్దుల్లోనూ దాడులు జరిగేవన్నారు. ప్రధాని మోదీ పదేండ్ల పాలనలో ఇలాంటి ఘటనలేవీ జరగలేదన్నారు. మోదీ సారథ్యంలో దేశంలో సుభిక్షమైన పాలన సాగిందన్నారు. ప్రజలకు కరెంటు, రోడ్లు, వంట గ్యాస్ లాంటి కనీస సౌలతులు కల్పించడంలో ఆయన సక్సెస్ అయ్యారన్నారు. రైతుల పరిస్థితి చూసి ఎరువులపై సబ్సిడీ ఇచ్చారన్నారు. రాష్ర్టంలో అద్దాల్లాంటి రోడ్లు వేశారంటే అది మోదీ ఘనతేనన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన మళ్లీ గెలిస్తేనే పేదల కష్టాలు తీరుతాయన్నారు. రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.  

రాహుల్ కోసమే సోనియా ఆరాటం: రూపాలా 

తన కొడుకు రాహుల్ గాంధీని పీఎంను చేయాలనే కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ ఆరాటపడుతున్నారని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా విమర్శించారు. ఇండియా కూటమిలోని వివిధ పార్టీల లీడర్లు కూడా ప్రధాని కుర్చీ కోసం పోటీ పడుతున్నారన్నారు. ప్రజలు మాత్రం మోదీనే మళ్లీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. మంగళవారం నారాయణపేట జిల్లా మక్తల్ వద్ద బీజేపీ విజయ సంకల్ప యాత్రలో ఆయన మాట్లాడారు. మహాభారతంలో శ్రీకృష్ణుడు రథ సారథిగా పాండవులను యుద్ధం గెలిపించినట్టే.. తెలంగాణలో కిషన్ రెడ్డి సారథ్యంలో జరిగే విజయ సంకల్ప యాత్ర బీజేపీని గెలిపిస్తుందన్నారు. రాష్ట్రం అభివృద్ధి కావాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ఆ పార్టీ నేత డీకే అరుణ కోరారు. ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకే కేసీఆర్​ను ప్రజలు ఇంటికి పంపారన్నారు. కాంగ్రెస్ కూడా అమల్లో సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తోందన్నారు. 

కాంగ్రెస్​కు 30 సీట్లు కూడా రావు: హిమంత 

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు కూడా రావని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా భైంసాలో బీజేపీ విజయ సంకల్ప యాత్రను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ పార్టీ గరీబోళ్ల రక్తం తాగుతున్నది. అబద్ధపు హామీలిచ్చి.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఇక్కడ రజాకార్ల పాలన ఇంకా ఉన్నది. ఎంపీ ఎన్నికల్లో సింగిల్​గానే పోటీ చేస్తాం. 17 స్థానాల్లో విజయం సాధిస్తాం. తెలంగాణలో లీటర్ పెట్రోల్ రూ.110 ఉంటే.. చిన్న రాష్ట్రమైన అస్సాంలో రూ.98కే ఇస్తున్నాం” అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇంకెప్పుడు రిలీజ్ చేస్తుందని ఆయన ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి 75 రోజులు గడుస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. 

‘వికసిత్ తెలంగాణ’ను ఆవిష్కరిస్తం: ప్రమోద్ సావంత్ 

మోదీ పదేండ్ల పాలనలో నయా భారత్ ఆవిష్కృతమైందని, రాబోయే రోజుల్లో వికసిత్ తెలంగాణ ఆవిష్కారం అవుతుందని గోవా సీఎం ప్రమోద్ సావంత్ అన్నారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో బీజేపీ విజయ సంకల్ప యాత్రను  ప్రారంభించి ఆయన మాట్లాడారు. ‘‘గరీబ్ హఠావో.. అన్న కాంగ్రెస్ పాలనలో పేదల సంఖ్య పెరిగింది. మోదీ పదేండ్ల పాలనలో ఎన్నో కుటుంబాలు పేదరికం నుంచి బయటికి వచ్చాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా సుపరిపాలన కొనసాగుతున్నది. కాంగ్రెస్ అంటేనే స్కామ్​లు. బీజేపీ పదేండ్ల పాలనలో ఒక్క స్కామ్​ కూడా జరగలేదు’’ అని సావంత్ అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని.. నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యం మాత్రం నెరవేరలేదన్నారు. 

మళ్లీ మోదీనే ప్రధాని: బీఎల్ వర్మ 

రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉందని, ఇక్కడున్న అన్ని ఎంపీ స్థానాల్లో పార్టీ గెలుస్తుందని కేంద్ర మంత్రి బీఎల్ వర్మ ధీమా వ్యక్తం చేశారు. మళ్లీ మోదీనే ప్రధాని అవుతారని అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూర్​లో బీజేపీ విజయ సంకల్ప్ యాత్రను ప్రారంభించి ఆయన మాట్లాడారు. కేంద్రం అందిస్తున్న సంక్షేమ పథకాలే మోదీని గెలిపిస్తాయని చెప్పారు. ఎన్డీఏ కూటమికి 400కు పైగా స్థానాలు వస్తాయన్నారు. తెలంగాణకు కేంద్రం గతంలో ఇచ్చిన స్కీమ్​లను కేసీఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. 

బీఆర్ఎస్ కు మూడో స్థానమే: బండి సంజయ్ 

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఛీకొట్టిన బీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఎందుకు పెట్టుకుంటామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. పుకార్లు పుట్టించేటోళ్లను చెప్పుతో కొట్టాలని ఫైర్ అయ్యారు. తాండూర్​లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. పొత్తుపై కేసీఆర్ మీడియానే లేనిపోని వార్తలు పుట్టిస్తున్నదని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మూడో స్థానంలో ఉండబోతున్నదని సర్వేలు చెప్తున్నాయన్నారు. కాంగ్రెస్​కు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు.