ఒకే పనిని రెండు స్కీమ్స్ కింద చూపించి..కోట్లు దోచుకుంటున్నరు

ఒకే పనిని రెండు స్కీమ్స్ కింద చూపించి..కోట్లు దోచుకుంటున్నరు
  • బీఆర్ఎస్ సర్కార్​పై తరుణ్​చుగ్ ఫైర్
  • రూ.4,144 కోట్లను పక్కదారి పట్టించారని ఆరోపణ

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడుతున్నదని, ఒకే పనిని రెండు వేర్వేరు స్కీమ్​ల కింద చూపించి కేంద్ర, రాష్ట్ర నిధులను స్వాహా చేస్తున్నదని బీజేపీ స్టేట్ ఇన్​చార్జ్ తరుణ్ చుగ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి మోసానికి పాల్పడటం దేశచరిత్రలో ఇదే మొదటిసారి అని ఆదివారం విడుదల చేసిన ప్రకటన​లో విమర్శించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు నిజామాబాద్ జిల్లాలో ఆరు రోడ్డు ప్రాజెక్ట్ పనుల్లో కూడా పెద్దఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. ఒకే పనిని రెండు స్కీమ్​ల కింద చూపించి.. రెండు సార్లు రిలీజైన నిధులను స్వాహా చేసిందని పేర్కొన్నారు. 

ALSO READ :మూతపడిన కొలాం బడిని తెరిపించేదెన్నడు?

ఈ పనుల్లో రోడ్ డెవలప్​మెంట్ కార్పొరేషన్​తో పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కేసీఆర్ ప్రభుత్వం బురిడీ కొట్టించిందని విమర్శించారు. రూ.4,144 కోట్లు పక్కదారి పట్టినట్లు స్పష్టమవుతున్నదని పేర్కొన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద చేపట్టిన పనులు, రోడ్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ రుణం ద్వారా చేపట్టిన పనులు ఒకటే అని ఆరోపించారు. తొమ్మిదేండ్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రోడ్ల స్కీమ్ కింద ఇచ్చిన నిధులు, రోడ్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ ద్వారా పొందిన రుణాలతో పాటు అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.