30 రోజుల్లో 40 సభలు స్టేట్ బీజేపీ ప్లాన్ .. త్వరలోనే అమిత్ షా సభలు ఖరారు

  • అక్టోబర్ 1న పాలమూరు, 3న నిజామాబాద్ లో మోదీ సభలు 
  • 6న రాష్ట్రానికి రానున్న నడ్డా

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల ప్రచారానికి బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. అక్టోబర్ నెలాఖరులోపు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 40 భారీ బహిరంగ సభలు నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఇందులో జాతీయ స్థాయి నేతల టూర్లు, ఏర్పాట్లపైనే ప్రధానంగా చర్చించారు. అక్టోబర్​ 1న మహబూబ్ నగర్,  3న నిజామాబాద్ లో నిర్వహించే సభల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. అక్టోబర్​ 6న రాష్ట్రానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు. సిటీ శివారులోని బొంగుళూర్ వద్ద నిర్వహించే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. 

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు రోడ్ మ్యాప్ ప్రకటించనున్నారు. పార్టీ మేనిఫెస్టో, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై ఇందులో చర్చించనున్నారు. త్వరలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలు కూడా ఖరారు కానున్నాయి. మోదీ, అమిత్ షా, నడ్డా ముగ్గురూ మూడు చొప్పున సభల్లో పాల్గొనేలా రాష్ట్ర నాయకత్వం ప్లాన్ చేస్తోంది. వీరితో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ నేతలు ఒక్కో సభకు చీఫ్ గెస్టుగా హాజరయ్యేలా ప్రణాళికలు రచిస్తోంది. అన్ని జిల్లా కేంద్రాలతో పాటు పలు ముఖ్య పట్టణాల్లో సభలు జరగనున్నాయి. 

రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది: కిషన్ రెడ్డి 

తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి పనులపై మోదీ సభలో మాట్లాడతారని చెప్పారు. ‘‘రాష్ట్ర అభివృద్ధి కోసం మోదీ సర్కార్ ఇప్పటికే రూ.లక్షల కోట్ల నిధులు ఇచ్చింది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో గుణాత్మకమైన మార్పు కోసం బీజేపీ నిరంతరం పోరాడుతున్నది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా 40 వరకు సభలు నిర్వహించాలని ప్లాన్  చేశాం. మేం అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేది ఈ సభల ద్వారా ప్రజలకు వివరిస్తాం” అని పేర్కొన్నారు. సభలను సక్సెస్​ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సమావేశంలో లక్ష్మణ్, మురళీధర్ రావు, వివేక్ వెంకటస్వామి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఇంద్రసేనా రెడ్డి, రవీంద్ర నాయక్, ప్రేమేందర్ రెడ్డి, బంగారు శృతి, దుగ్యాల ప్రదీప్, కాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 

మోదీ టూర్​లో మార్పులు.. 

మోదీ మహబూబ్ నగర్ టూర్ లో స్వల్ప మార్పులు జరిగాయి. ప్రధాని అక్టోబర్ 1న మధ్యాహ్నం 1:30 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్టుకు బదులు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్ లో పాలమూరుకు వెళ్తారు. హైదరాబాద్ లో అభివృద్ధి పనులకు  చేయాల్సిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను మధ్యాహ్నం 2:15 గంటల నుంచి 2:50 గంటల మధ్య అక్కడి నుంచే వర్చువల్ గా చేస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 4:10 గంటలకు హెలికాప్టర్ లో బయలుదేరి 4:45 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 5:10 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారు.