- బీజేపీ నియోజక వర్గ ఇన్చార్జి వెంకటరమణారెడ్డి అరెస్ట్
- అయినా కొనసాగుతుందన్న వెంకటరమణారెడ్డి
కామారెడ్డి , వెలుగు: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో కామారెడ్డి నియోజకవర్గంలో పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. సీఎం కేసీఆర్ గజ్వేల్‌ను అభివృద్ధి చేసినట్టే కామారెడ్డిని అభివృద్ధి చేస్తారని, దీంతో నియోజకవర్గ రూపురేఖలు మారిపోతాయని బీఆర్ఎస్ నాయకులు కొద్దిరోజులుగా ప్రచారం చేస్తున్నారు. దీనికి బీజేపీ, కాంగ్రెస్‌లాంటి ప్రతిపక్షాలు దీటుగానే కౌంటర్ ఇస్తున్నాయి. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో అసలు అభివృద్ధే జరగలేదని, సీఎం దత్తత గ్రామాల్లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని, ముఖ్యంగా మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు భూములిచ్చిన ముంపు బాధితుల కష్టాలు తీరడం లేదని బీజేపీ లీడర్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికీ పరిహారం కోసం, పునరావాసం కోసం నిర్వాసితులు రోడ్లెక్కుతున్నారని గుర్తు చేస్తున్నారు. ఈక్రమంలోనే గజ్వేల్ నియోజకవర్గంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులను కామారెడ్డి నియోజకవర్గంలోని ప్రజలకు స్వయంగా చూపించేందుకు బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి ‘చలో గజ్వేల్’ప్రోగ్రామ్ చేపడుతున్నట్లు మూడు రోజుల కింద ప్రకటించారు. ఇందులో భాగంగా శుక్రవారం చేపట్టే గజ్వేల్ పర్యటనకు 100 దాకా వెహికిల్స్ ఏర్పాటు చేశారు.
ముందుగా దేవునిపల్లికి...
కామారెడ్డి టౌన్ నుంచి ముందుగా దేవునిపల్లి చేరుకొని శివాజీ విగ్రహానికి పూలమాల వేశాక బయలుదేరుతారు. గజ్వేల్‌లో శివాజీ విగ్రహానికి క్షీరాభిషేకం చేశాక ఆయా గ్రామాల్లో పర్యటిస్తారు. మల్లన్న సాగర్నిర్వాసిత గ్రామాల ప్రజలు ఉంటున్న గజ్వేల్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో తలదాచుకుంటున్న నిర్వాసితుల కష్టాలను స్వయంగా పరిశీలిస్తారు. ప్రభుత్వం నిర్వాసితుల భూములను, ఇండ్లను తీసుకొని పరిహారం ఇవ్వకుండా, పునరావాసం చూపకుండా ఎన్ని కష్టాలు పెడ్తుందో బాధితుల ద్వారా తెలుసుకుంటారు. మంత్రి హరీశ్‌రావు దత్తత తీసుకున్న కొలిగురిలో కూల్చిన ఇండ్లను పరిశీలిస్తారు. ఇక నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ అందుబాటులో ఉండకపోవడం వల్ల షాడో ఎమ్మెల్యేలు తయారయ్యారని, ఈ షాడో ఎమ్మెల్యేలు చేపడ్తున్న అభివృద్ధి పనుల్లో అవినీతిని, వారి వల్ల పబ్లిక్ పడ్తున్న తిప్పలను స్వయంగా తెలుసుకుంటామన్నారు. గజ్వేల్ తో పాటు వర్గల్, తుఫ్రాన్, మనోహరాబాద్, జగదేవ్‌పూర్ మండలాల్లో పర్యటన ఉంటుందని, కామరెడ్డి జిల్లా ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చి గజ్వేల్‌లో అభివృద్ధి ముసుగులో జరుగుతున్న అరాచకాలను కళ్లారా చూడాలని వెంకటరమణారెడ్డి విజ్ఞప్తి చేశారు.
వెంకటరమణారెడ్డి అరెస్ట్
కామారెడ్డి టూ చలో గజ్వేల్ ప్రోగ్రామ్ అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తు అరెస్టులకు దిగారు. గురువారం రాత్రి 9 గంటలకు కాటిపల్లి వెంకటరణా రెడ్డి ఇంటిని చుట్టుముట్టిన పోలీసు బలగాలు ముందుగా లీడర్లను, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నాయి. తర్వాత వెంకటరమణారెడ్డిని జీపులో ఎక్కించుకొని జుక్కల్ఏరియా వైపు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ తనను అరెస్ట్ చేసినంత మాత్రాన కార్యక్రమాన్ని ఎవ్వరూ ఆపలేరన్నారు. శుక్రవారం జనాలు పెద్ద ఎత్తున తరలివెళ్తారన్నారు. గజ్వేల్‌లో నిజంగా అభివృద్ధి చేసినట్టయితే అరెస్టులు ఎందుకని ప్రశ్నించారు.