బీజేపీ ఆదాయం రూ.1,917 కోట్లు

న్యూఢిల్లీ: దేశంలోని 8 గుర్తింపు పొందిన జాతీయ పార్టీల మొత్తం ఆదాయం రూ.3,289 కోట్లు అని అసోసియేషన్​ ఫర్​ డెమొక్రటిక్​ రిఫార్మ్స్(ఏడీసీ) వెల్లడించింది. ఈ మొత్తంలో ఒక్క బీజేపీదే సగానికి పైగా ఆదాయం ఉన్నట్టు తెలిపింది. ఆ పార్టీ టోటల్ ఇన్​కం రూ.1,917.12 కోట్లని, ఇందులో రూ.854.467 కోట్లు లేదా 44.57 శాతం ఖర్చు చేసిందని ప్రకటించింది. పార్టీల ఆదాయం విషయంలో మమతాబెనర్జీ నేతృత్వంలోని తృణమూల్​ కాంగ్రెస్(టీఎంసీ) రెండో ప్లేస్​లో నిలిచింది. ఆ పార్టీ ఇన్​కం రూ.545 కోట్లు. ఇందులో రూ.268.337 కోట్లు లేదా 49.17 శాతం ఖర్చు చేసింది. ఆ తర్వాతి స్థానంలో కాంగ్రెస్​ పార్టీ ఉంది. దాని ఆదాయం రూ.541.275 కోట్లు కాగా.. రూ.400.414 కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడించింది. ఎన్నికల కమిషన్​కు అప్పగించిన ఆడిట్​ రిపోర్టుల ఆధారంగా 2021-–22లో పార్టీలకు దేశవ్యాప్తంగా వచ్చిన విరాళాల వివరాలను బుధవారం ఏడీఆర్​ వెల్లడించింది.

ఎలక్టోరల్​ బాండ్ల రూపంలోనే ఎక్కువ

బీజేపీ, టీఎంసీ, కాంగ్రెస్, ఎన్సీపీలు తమ మొత్తం ఆదాయంలో ఎలక్టోరల్​ బాండ్ల రూపంలో సేకరించిన విరాళాలు రూ.1,811.94 కోట్లు లేదా 55.09 శాతంగా ఉన్నట్టు ఏడీఆర్ తెలిపింది. బీజేపీకి బాండ్ల రూపంలో వచ్చిన డొనేషన్లే రూ.1,033.7 కోట్లు. తృణమూల్​కు రూ.528.143 కోట్లు, కాంగ్రెస్ కు రూ.236.09 కోట్లు, ఎన్సీపీకి రూ.14 కోట్లు వచ్చాయి. ఏడీఆర్ అప్లికేషన్​కు ఎస్బీఐ ఇచ్చిన రిప్లై ప్రకారం.. 2021–22లో రూ.2,673.05 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను పార్టీలు రెడీమ్ చేశాయి. ఇందులో 67.79 శాతం జాతీయ పార్టీలు రెడీమ్ చేశాయి. కాగా, 2020–21తో పోలిస్తే 2021–22లో బీజేపీ ఆదాయం 155 శాతం లేదా రూ.1,164.78 కోట్లు పెరిగింది. 2020–21లో ఆ పార్టీ ఆదాయం రూ.752.34 కోట్లే. 

633 శాతం పెరిగిన టీఎంసీ ఆదాయం

టీఎంసీ ఆదాయం 633% పెరిగింది. 2020–21లో ఆ పార్టీ ఆదాయం రూ.74.42 కోట్లు కాగా, ఇప్పుడు రూ.545.74 కోట్లకు చేరింది. కాంగ్రెస్ పార్టీ ఇన్​కం 89.41 శాతం పెరిగింది.