- గిగ్ వర్కర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తం: అమిత్ షా
- 50 వేల సర్కార్ కొలువులను భర్తీ చేస్తం
- శరణార్థి కాలనీల్లోని ప్రజలకు యాజమాన్య హక్కులు కల్పిస్తం
- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చివరి మేనిఫెస్టో ప్రకటించిన బీజేపీ
న్యూఢిల్లీ: ఢిల్లీలో బీజేపీని గెలిపిస్తే రాబోయే మూడేండ్లలోనే యుమునా నదిని శుద్ధి చేస్తామని, సబర్మతి రివర్ఫ్రంట్లా మారుస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. గిగ్ వర్కర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు. యమునా నదిని లండన్‌లోని థేమ్స్ నదిలా మారుస్తామని అలవికాని హామీలిచ్చిన ఆప్ సర్కారు.. ఆ వాగ్దానాన్ని నెరవేర్చడంలో విఫలమైందని మండిపడ్డారు. “యమునా నదిని శుభ్రపరిచి ఢిల్లీ ప్రజలముందే అందులో స్నానం చేస్తానని ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ చెప్పారు.
ఆయన ఆ నదిలో ఎప్పుడు స్నానం చేస్తారోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆయన పాపాలు కడుక్కోవడానికి యమునా నదిలో కాకుంటే మహాకుంభ్‌కు వెళ్లి అక్కడ మునుగొచ్చు” అంటూ చురకలంటించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ మూడో (చివరి) విడత మేనిఫెస్టోను శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేశారు. ‘సంకల్ప పత్రం’ పేరిట రూపొందించిన మేనిఫెస్టోలో ఇప్పటికే రెండు భాగాలను ప్రకటించిన బీజేపీ.. వాటికి అదనంగా మరిన్ని హామీలతో చివరి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది.
మా మేనిఫెస్టోలో బూటకపు హామీలు ఉండవు
తమ మేనిఫెస్టోలో బూటకపు వాగ్దానాలు ఉండవని, ఢిల్లీలో చేపట్టాల్సిన పనుల జాబితా మాత్రమే ఉందని అమిత్‌షా పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఆప్ ప్రభుత్వం నెరవేర్చలేదని అన్నారు. కలుషితమైన యుమునా నదిని శుభ్రం చేయించలేదని, ప్రజలకు సరైన తాగునీటి సౌకర్యం అందించలేదని, దేశ రాజధానిని కాలుష్య రహితంగా మార్చలేదని మండిపడ్డారు. ఎన్నడూ లేని విధంగా కేజ్రీవాల్ నేతృత్వంలో అవినీతి మరింతగా పెరిగిపోయిందని విమర్శించారు. ప్రభుత్వ బంగ్లాను తీసుకోని ఆప్అధినేత కేజ్రీవాల్.. 50వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 51 కోట్లు ఖర్చు చేసి.. శీష్ మహల్‌ను నిర్మించారని ఆరోపించారు.
చివరి మేనిఫెస్టోలోని హామీలివే..
గిగ్ వర్కర్ల (డెలివరీ తదితర రంగాల్లో పనిచేసేవారి) కోసం సంక్షేమ బోర్డు .. రూ. 10 లక్షల జీవిత బీమా, రూ. 5 లక్షల ప్రమాద బీమా అందజేస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. గిగ్ వర్కర్ల పిల్లలకు ప్రత్యేకంగా స్కాలర్షిప్స్ అందజేస్తామని చెప్పింది. 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, 20 లక్షల వరకు స్వయం ఉపాధి అవకాశాలు సృష్టిస్తామని హామీ ఇచ్చింది. శరణార్థి కాలనీల్లోని ప్రజలకు యాజమాన్య హక్కులు కల్పించి, రాజధానిలో మూతపడిన13వేల దుకాణాలను 6 నెలల్లో లీగల్‌గా ఓపెన్ చేయిస్తామని తెలిపింది1,700 అనధికారిక కాలనీల్లో కన్స్ట్రక్షన్కు సంబంధించి కొనుగోలు, అమ్మకాలకు అవకాశం కల్పిస్తామని పేర్కొన్నది. మొదటి కేబినెట్ మీటింగ్‌లోనే ‘ఆయుష్మాన్ భారత్’ స్కీమ్ అమలు కోసం నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు 13వేల ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువస్తామని తెలిపింది.
రూ.500కే సిలిండర్.. పేద మహిళకు ప్రతి నెలా రూ.2,500
ఇప్పటికే ప్రకటించిన రెండు మేనిఫెస్టోల్లో పేద మహిళలకు ప్రతి నెలా రూ. 2,500 ఇస్తామని.. ప్రతి గర్భిణికి రూ.21వేల సహాయం అందజేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. రూ.500కే సిలిండర్ ఇస్తామని.. హోలీ, దీపావళి రోజు ఫ్రీగా సిలిండర్లు పంపణి చేస్తామని.. వృద్ధాప్య పింఛన్‌ను రూ.2,500కు పెంచుతామని వంటి వాగ్దానాలు చేసింది.
వచ్చే నెల 5న ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా.. మొత్తం 70 సీట్లకు గాను బీజేపీ 68 చోట్ల పోటీ చేస్తున్నది. మిగతగా రెండు సీట్లను ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన జేడీయూ, ఎల్జేపీ(రామ్ విలాస్)కి కేటాయించింది.