భువనగిరిలో బీజేపీ బీసీ అస్త్రం..తొలి జాబితాలో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌‌కు చోటు​

  •     తెలంగాణ ఉద్యమంలో డాక్టర్​ జేఏసీలో కీలక పాత్ర
  •     బీఆర్ఎస్​లో గ్రూపు తగాదాల వల్ల పార్టీ నుంచి బయటికి..  
  •     నల్గొండ సీటుకు పోటీపడుతున్న పలువురు అభ్యర్థులు
  •     రెడ్డి సామాజిక వర్గానికే ఇచ్చే అవకాశం 

నల్గొండ, యాదాద్రి, వెలుగు : భువనగిరి పార్లమెంట్‌‌పై బీజేపీ బీసీ అస్త్రాన్ని ప్రయోగించింది. శనివారం ఆ పార్టీ హైకమాండ్ ప్రకటించిన తొలి జాబితాలో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌‌కు చాన్స్‌‌ ఇచ్చింది.  భువనగిరి సీటు బీసీలకు ఇవ్వాలనే ముందునుంచీ డిమాండ్ ఉంది. అయితే ఇక్కడి నుంచి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగడి మనోహర్​ రెడ్డి, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు పీవీ శ్యాసుందర్​రావు టికెట్​ కోసం గట్టిగానే ప్రయత్నించారు. 

కానీ, మునుగోడు ఉపఎన్నికల సమయంలో ఎంపీ టికెట్‌‌ హామీతో బీఆర్ఎస్‌‌లో చేరిన బూర వైపే హైకమాండ్ మొగ్గు చూపింది.  తెలంగాణ ఉద్యమ సమయంలో డాక్టర్​ జేఏసీలో కీలక పాత్ర పోషించిన బూర నర్సయ్యగౌడ్‌‌ను కేసీఆర్‌‌‌‌ బీఆర్‌‌‌‌ఎస్‌‌ చేర్చుకొని 2014లో భువనగిరి టికెట్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో గెలిచిన బూర పార్టీలో గ్రూపు తగదాల కారణంగా 2019లో ఓడిపోయారు.  కాగా, బూర నర్సయ్య పుట్టిన రోజే పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం విశేషం. 

మునుగోడు బైపోల్ సమయంలో బీజేపీలోకి.. 

2014 ఎంపీ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగో పాల్​రెడ్డిని ఓడగొట్టిన నర్సయ్యగౌడ్​, తిరిగి 2019 ఎన్నికల్లో రాజగోపాల్​ రెడ్డి అన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో ఓడిపోయారు. బీఆర్ఎస్ సిట్టిం గ్ స్థానాన్ని కోల్పోవడంతో పార్టీ నర్సయ్య గౌడ్‌‌పైనే నిందలు వేసింది. ఆలేరు, నకిరేకల్​, భువనగిరి, మునుగోడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అప్పటి ఎమ్మెల్యేలు, పార్టీ కేడర్​ సహరించలేదనే సంగతిని పార్టీ ఏమాత్రం పట్టించుకోలేదు. అయితే మునుగోడు ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్​ వస్తదని నర్సయ్య గౌడ్​ ఆశించారు. కానీ, ఆయన పేరును కనీసం పార్టీ పరిగణలోకి తీసుకోకపోగా, పార్టీ హై కమాండ్‌‌ సహా,  మాజీ మంత్రి జగదీశ్‌‌ రెడ్డి సైతం  దూరం పెట్టారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన బైపోల్‌‌లో బీజేపీలో చేరారు. 

ప్రత్యర్థులకు సవాలే

బీజేపీ బూర నర్సయ్య గౌడ్‌‌ను ప్రకటించడం ద్వారా బీఆర్​ఎస్​, కాంగ్రెస్‌‌కు సవాల్​ విసిరింది. ఈ పార్టీల నుంచి ఓసీ కులాలకు చెందిన వారే టికెట్‌‌ కోసం ప్రయత్నిస్తున్నారు. గడిచిన మూడు ఎన్నికల్లోనూ కాంగ్రెస్​ కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అభ్యర్థులుగా నిలబెట్టింది. కాంగ్రెస్‌‌ 2014లో ఓడిపోగా  2009, 2019లో గెలిచింది.  ఈ పార్టీ నుంచి ప్రస్తుతం కూడా పది మంది ఓసీలు,  బీఆర్ఎస్​తరఫున ఇద్దరు బీసీలు, కొందరు ఓసీలు ప్రయత్నాలు చేస్తున్నారు.  

కాగా, భువనగిరి లోక్​సభ పరిధిలోని ఏడు అసెంబ్లీలో బీసీ వర్గాలైన కురుమ, గొల్ల, గౌడ, ముదిరాజ్, పద్మశాలి ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. ఈ సెగ్మెంట్‌‌లో బీజేపీ బలం నామమాత్రమైనప్పటికీ.. 2014 ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో పోటీ చేసిన ఆ పార్టీ అభ్యర్థి నల్లు ఇంద్రసేనారెడ్డికి 1.82  లక్షల ఓట్లు పడ్డాయి. ఈ సారి బీసీ క్యాండిడేట్‌‌కు తోడు ప్రధాని మోదీ చరిష్మా,  అయోధ్యలో రామ మందిర నిర్మాణం కలిసి వస్తుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. 

నల్గొండ సీటు పై సందిగ్ధం

నల్గొండ పార్లమెంట్​సీటుకు బీజేపీలో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రముఖ న్యాయవాది, సీనియర్​ నాయకుడు నూకల నర్సింహారెడ్డి, ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పార్టీలో చేరేందుకు సిద్ధమైన పిల్లి రామరాజు యాదవ్​, పార్లమెంట్​కన్వీనర్​ బండారు ప్రసాద్​, గార్లపాటి జితేంత్ర కుమార్​, వెదిరె శ్రీరాం, మన్నెం రంజిత్​ యాదవ్​ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీళ్లతోపాటు గంగడి మనోహర్​ రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. మునుగోడు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన మనోహర్​ రెడ్డి, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్​కోటరిలో ఉన్నారు. రాజగోపాల్​ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో మనోహర్​రెడ్డికి చాన్స్‌‌ దక్కలేదు. 

ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌‌బీనగర్​ టికెట్​ ఆశించినప్పటికీ నిరాశే ఎదురైంది. దీంతో భువనగిరి ఎంపీ టికెట్​ఇవ్వాలని ఆయన పట్టుబట్టారు. కానీ అప్పటికే నర్సయ్య గౌడ్​కు పార్టీ హైకమాండ్​హామీ ఇచ్చింది. అయినప్పటికీ ఢిల్లీ స్థాయిలో గట్టిగా ప్రయత్నం చేయడంతో నల్గొండ ఎంపీగా పోటీ చేయాలని సూచించినట్లు తెలిసింది. నల్గొండ సెగ్మెంట్‌‌లో  కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ పార్టీలు రెడ్డి సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులనే నిలబెట్టాలనే ఆలోచన చేస్తుండడం కూడా ఇందుకు కారణంగా తెలుస్తోంది.  

బీజేపీలోకి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ?

బీజేపీలోకి బై ఎలక్షన్లలో గెలిచిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చేరనున్నట్లు ప్రచారం జరుగుతంది. నల్గొండ ఎంపీ టికెట్ అభ్యర్థుల పరిశీలనలో ఆయన పేరు కూడా ఉన్నట్లు తెలిసింది. ఇటీవల బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మరో నేత బీజేపీలో చేరడం.. వాళ్లకు ఎంపీ టికెట్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఇదే జాబితాలో ఆయనతోనూ పార్టీ అగ్రనేతలు చర్చలు జరిపినట్లు తెలిసింది. నల్గొండ క్యాండిడేట్ ప్రకటించకపోవడానికి ఇది కూడా ఒక కారణమని పార్టీ సీనియర్ నేత ఒకరు ‘వెలుగు’తో చెప్పారు.