తెలంగాణలో రెండో రోజు బీజేపీ విజయ సంకల్ప యాత్ర కొనసాగుతోంది. ఫిబ్రవరి 21వ తేదీ బుధవారం నారాయణ పేట, మహబూబ్ నగర్ జిల్లాల్లో కొనసాగుతున్న ఈ యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా నారాయణ పేట పట్టణంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
మూడోసారి మోదీ ప్రధాని అవుతారని.. ఆయనను ఎవరూ ఆపలేరన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణలోని మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల గెలుపుతో తెలంగాణ రాష్ట్రానికి ఒరిగేదేమి ఉండదని అన్నారు. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజలు విసిగిపోయారన్నారాయ. దేశంలో కేవలం మూడు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ అధికారంలో ఉందన్నారు. కాంగ్రెస్ పీఎం అభ్యర్థి ఎవరో వారికే తెలియదని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
తెలంగాణలో మెజార్టీ పార్లమెంట్ స్థానాలను గెలుచుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది బీజేపీ. ఇందులో భాగంగానే ఫిబ్రవరిలో 20వ తేదీ మంగళవారం నిర్మల్ జిల్లా బైంసాలో విజయసంకల్ప యాత్రను బీజేపీ జాతీయ నేతలు ప్రారంభించారు. ఈ యాత్ర పేరుతో బీజేపీ నేతలు ప్రజల్లోకి వెళ్తూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ యాత్ర ముగింపు సభకు ప్రధాని మోడీ హాజరు కానున్నారు.