ఆర్వోబీకి మంత్రి గంగుల శంకుస్థాపన..బండి సంజయ్ జిందాబాద్ అంటూ నినాదాలు

కరీంనగర్లో  ఓ అభివృద్ధి కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్గీయులు,  బీజేపీ వర్గీయుల మధ్య వివాదం చెలరేగింది.  తీగలగుట్టపల్లి ఆర్ఓబి శంకుస్థాపన సందర్భంగా బీజేపీ కార్యకర్తలు, బిఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేశారు. 

కరీంనగర్ రూరల్ మండలం తీగలగుట్టపల్లి వద్ద నిర్మించనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తో కలిసి  మంత్రి గంగుల కమలాకర్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో  బీఆర్ఎస్ కార్పొరేటర్లపాటు..బీజేపీప్రజాప్రతినిధులు , కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్వోబీకి మంత్రి గంగుల  శంకుస్థాపన చేసిన వెంటనే బండి సంజయ్ జిందాబాద్ అంటూ బీజేపీ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. బీజేపీ కార్పొరేటర్లకు పోటీగా బీఆర్ఎస్ జిందాబాద్ అంటూ బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు.

ఆర్వోబీ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ముగిసిన తర్వాత శిలాఫలకం దగ్గర బీజేపీ నేతలు  నిరసన తెలిపారు. కేంద్రం ఇచ్చిన నిధులతో రాష్ట్ర ప్రభుత్వం సోకులు చేసుకుంటుందంటూ ఆరోపించారు. ఆ తర్వాత  బండి సంజయ్, ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రుల చిత్రపటాలకు బీజేపీ నేతలు పాలాభిషేకం చేశారు.