ఆదిలాబాద్, వెలుగు: ఆదివాసీ ఖిల్లా, ఆదిలాబాద్పార్లమెంట్స్థానంపై కాంగ్రెస్, బీజేపీ కన్నేశాయి. సిట్టింగ్సీటు కాపాడుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్న బీజేపీ హైకమాండ్ అభ్యర్థి ఎంపికపై ఆచితూచి అడుగేస్తుండగా, ఈ సీటుపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్ పెట్టడం ఆసక్తిరేపుతోంది. లోక్ సభ ఎన్నికల శంఖారావాన్ని రేవంత్ ఇక్కడి నుంచే ప్రారంభించడం విశేషం. బీజేపీ సైతం జిల్లాలో విజయసంకల్ప యాత్ర ముగించుకొని సమరోత్సాహంలో ఉండగా, బీఆర్ఎస్లో మాత్రం ఎలాంటి సందడి కనిపించడం లేదు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన రెండు లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి ఓటర్లు భిన్నమైన తీర్పు ఇచ్చారు. 2014లో బీఆర్ఎస్ ను గెలిపించినప్పటికీ 2019లో అనూహ్యంగా బీజేపీకి పట్టం కట్టారు. ఈసారి కూడా మార్పు తప్పదని, తమ పార్టీ అధికారంలోకి రావడంతో ఆదిలాబాద్ప్రజలు తమవైపే నిలుస్తారని కాంగ్రెస్‌నేతలు ధీమాగా చెప్తున్నారు.
సీఎం సభతో కాంగ్రెస్‌లో జోష్..
ఆదిలాబాద్ ఎంపీ సీటును ఈసారి ఎలాగైనా తన ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని ఆదిలాబాద్ జిల్లా నుంచి మోగించారు. గత నెల 2న ఇంద్రవెల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభ సక్సెస్ కావడంతో ఆ పార్టీ క్యాడర్లో ఫుల్ జోష్ కనిపిస్తున్నది. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆదిలాబాద్ ను దత్తత తీసుకుంటామని చెప్తూ వచ్చిన సీఏం రేవంత్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మంత్రి సీతక్క సైతం ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జిగా తన మార్క్ చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈసారి నాగోబా జాతర నిర్వహణలో సర్కారు తీసుకున్న చొరవ, దర్బార్‌లో గిరిజనుల సమస్యల పరిష్కారానికి ఇచ్చిన హామీలు, ఆరుగ్యారెంటీల అమలు, మంత్రి సీతక్క ప్రభావం ఆదివాసీ ఓటర్లపై ఉంటుందనే చర్చ జరుగుతోంది.
ఆదిలాబాద్ జిల్లాపై సీఏం, సీతక్క చూపుతున్న ప్రత్యేక శ్రద్ధతో ఇప్పటికే వివిధ పార్టీల నుంచి జెడ్పీ చైర్మెన్, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఇతర సీనియర్లంతా కాంగ్రెస్ లో చేరడంతో ఆ పార్టీ మరింత బలపడింది. పార్లమెంట్ ఎన్నికల చరిత్ర చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ గట్టిపోటీ ఇస్తోంది. ఈ ఎంపీ సీటును కాంగ్రెస్ ఇప్పటి వరకు 8 సార్లు గెలిచింది. 2019 ఎన్నికల్లోనూ ఆ పార్టీ 3.14 లక్షల ఓట్లు అంటే 29 శాతం ఓట్లు సాధించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖనాయక్, కాంగ్రెస్ సీనియర్ లీడర్లు నరేశ్ జాదవ్, శ్రావణ్ నాయక్, శ్రీనివాస్ నాయక్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, గవర్నమెంట్ టీచర్ ఆత్రం సుగుణ తో పాటు పలువురు రిటైర్డ్ ఉన్నతాధికారులు, ఉద్యోగులు మొత్తంగా 22 మంది కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే రేఖనాయక్, కాంగ్రెస్ సీనియర్ లీడర్ నరేశ్ జాదవ్ లలో ఎవరో ఒకరికి టికెట్వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బీజేపీలో టికెట్ వార్..
2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీ సీటును బీజేపీ మొదటిసారి కైవసం చేసుకుంది. ఆ పార్టీ నుంచి ఆదివాసీ లీడర్ సోయం బాపురావు గెలుపొందారు. అప్పటి పరిస్థితుల్లో ఆదివాసీలంతా పార్టీలకతీతంగా ఏకమై, సోయంబాపురావుకు మద్దతిచ్చారు. కానీ ఆదివాసుల డిమాండ్లలో ఏ ఒక్కటీ ఇప్పటివరకు నెరవేరకపోవడంతో నిరాశతో ఉన్నారు. అప్పట్లో బీజేపీలో ఎలాంటి వర్గపోరు లేకపోవడం కలిసివచ్చింది. కానీ ప్రస్తుతం పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. సోయం కాంగ్రెస్‌లో చేరుతారంటూ ఆ మధ్య మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. బీజేపీ ఎమ్మెల్యేలు సైతం సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. సోయం తీరుపై హైకమాండ్‌కు ఫిర్యాదులు వెళ్లాయని, ఈక్రమంలోనే ఆయన అభ్యర్థిత్వంపై అధిష్ఠానం పునరాలోచన చేస్తోందనే వార్తలు చక్కర్లు కొడ్తున్నాయి. ఇందుకు తగ్గట్లే పార్లమెంట్ ఇన్చార్జి బాధ్యతలను హైకమాండ్ ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు అప్పగించింది.
మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు గెలవడంతో ఆ పార్టీ బలంగా కనిపిస్తోంది. అయోధ్య రామమందిరం, నరేంద్ర చరిష్మా కూడా తోడైతే తమ గెలుపు నల్లేరు మీద నడకేనని బీజేపీ లీడర్లు అంటున్నారు. ఈ క్రమంలోనే ఆ పార్టీ టికెట్ కోసం పోటీ తీవ్రమైంది. మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, భైంసా మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ జాదవ్ రాజేష్ బాబు, ఆదివాసీ లీడర్ శ్రీలేఖ, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, సినీ నటుడు అభినవ్ సర్దార్, డాక్టర్ సుమలత ఇలా దాదాపు 40 మంది టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
అంపశయ్యపై బీఆర్ఎస్..
ఓ వైపు రెండు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ.. లోక్ సభ ఎన్నికలకు శంఖరావం పూరించగా, బీఆర్ఎస్ లో మాత్రం ఎలాంటి ఉత్సాహం కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాలను గెలిచినప్పటికీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చే సరికి పార్టీ పూర్తిగా చతికిలపడింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ లోని సీనియర్ లీడర్లు, ప్రజాప్రతినిధులంతా కాంగ్రెస్ కు క్యూ కట్టడంతో ఆ పార్టీ ఖాళీ అయిపోయింది. కనీసం ఎంపీ సీటు ఆశించే లీడర్లు కూడా లేకపోవడం గమనార్హం. ప్రస్తుతానికి మాజీ ఎంపీ గొడం నగేశ్, ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేర్లు వినిపిస్తున్నాయి.
గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 3.18 లక్షల ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. కానీ ఇప్పుడు ఆ ఓట్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. పదేళ్ల పాటు ఉమ్మడి జిల్లాను శాసించిన బీఆర్ఎస్ ఇప్పుడు ఏ స్థాయిలోనూ ప్రధాన పార్టీలకు పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో మాజీ ఎమ్మెల్యేలు సైతం సైలెంట్ అయిపోయారు. దీంతో ఉన్న క్యాడర్ కూడా కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లోకి జంప్ అవుతోంది.