- పెద్ద సంఖ్యలో చేరికలపై నజర్
- త్వరలోనే ఎమ్మెల్సీ క్యాండిడేట్ల ప్రకటన
- బీజేపీ ఆఫీసు బేరర్ల సమావేశంలో నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్లో మున్సిపల్ ఎన్నికల వేడి షురూ అయింది. ఇప్పటి నుంచే విజయం కోసం బీజేపీ, టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తున్నాయి. బీజేపీని బలహీన పరిచేందుకు టీఆర్ఎస్ ప్లాన్ చేస్తుండగా.. టీఆర్ఎస్లోని అసంతృప్త నే తలపై బీజేపీ గురిపెట్టింది. వచ్చే ఏడాది జనవరి రెండో వారంలోపు జీహెచ్ఎంసీ ఎన్నికలు పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తున్నది. ఇందుకోసం కసరత్తు మొదలు పెట్టింది. రాజకీయ పార్టీలు కూడా తమ బలాన్ని పెంచుకోవడంతో పాటు ప్రత్యర్థి పార్టీని బలహీనపరిచే పనిలో పడ్డాయి. తాము బలహీనంగా ఉన్న డివిజన్లపై టీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. అక్కడున్న బీజేపీ నేతలను మచ్చిక చేసుకుని పనిలో పడింది. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ కూడా కౌంటర్ ఆపరేషన్ స్టార్ట్ చేసినట్లు సమాచారం.
40 డివిజన్లలో టీఆర్ఎస్ కు నెగెటివ్
జీహెచ్ఎంసీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ మధ్య నిఘా వర్గాలు ద్వారా రెండు మూడు సర్వేలు జరిపించారు. ఆ సర్వేల్లో దాదాపు 40 డివిజన్లలోని ప్రజలు ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకంగా, బీజేపీ పట్ల సానుకూలంగా ఉన్న విషయాన్ని గుర్తించినట్టు తెలిసింది. దీంతో బీజేపీ పట్టున్న డివిజన్లపై టీఆర్ఎస్ లీడర్లు దృష్టి పెట్టి.. స్థానిక బీజేపీ నేతలకు ఫోన్లు చేసి, పార్టీలో చేరాలని కోరుతున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే ఈ మధ్యే జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ కు చెందిన బీజేపీ నేతలు శ్రీధర్ రెడ్డి, మహేందర్ యాదవ్ ను మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్లో చేర్చుకున్నట్టు లీడర్లు భావిస్తున్నారు. మిగతా డివిజన్లలోని బీజేపీ నేతలను మచ్చిక చేసుకుని, పార్టీలో చేర్చుకునే బాధ్యతలను కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలకు అప్పగించారని తెలిసింది. పార్టీలో చేరితే ఎలాంటి తాయిలాలు ఉంటాయో వివరిస్తున్నట్టు టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
టీఆర్ఎస్ అసంతృప్త నేతలపై బీజేపీ ఫోకస్
టీఆర్ఎస్ అసంతృప్త నేతలపై బీజేపీ దృష్టి పెట్టింది. కార్పొరేటర్ టికెట్ ఆశించి భంగపడే నేతలపై ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టు తెలిసింది. టీఆర్ఎస్ లో ఒక్కో డివిజన్ నుంచి సగటును 5 మంది ఆశావాహులు ఉన్నారు. టికెట్ దక్కని మిగతా నలుగురిని పార్టీలోకి చేర్చుకునే వ్యూహంలో బీజేపీ నేతలు ఉన్నారు. కొందరు సిట్టింగ్ కార్పొరేటర్లకు లోకల్ ఎమ్మెల్యేలతో విభేదాలు ఉన్నాయి. వారంతా బీజేపీలోకి వచ్చేందుకు రెడీగా ఉన్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. శుక్రవారం రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజవర్గానికి చెందిన మైలార్ దేవులపల్లి కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ లో చేరారు. ఇదే బాటలో అంబర్పేట, ఉప్పల్, మల్కాజ్గిరి, ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ లీడర్లు ఉన్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తున్నది.