ఈటల రాజేందర్ రాజీనామ చేసిన నాటి నుంచి సీఎం కేసీఆర్‌లో మొదలైన టెన్షన్‌కు నవంబర్ 3న ఎండ్ కార్డ్ పడింది. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల ఘన విజయం సాధించడం కేసీఆర్‌కు పెద్ద తలనొప్పినే తెచ్చిపెట్టింది. అక్కడ కేసీఆర్ కానీ గెలిచి ఉంటే హుజూరాబాద్ ప్రజలు తెలివైన వారని అక్కడ ధన్యవాద సభలు భారీగా పెట్టేవారు. కానీ అలా జరగకపోయేసరికి ఓటర్లకు కృతజ్ఞత లేదని, లీడర్లు మోసం చేశారని సణుగుడు మొదలైంది. దీనికి ఆజ్యం పోస్తూ కేసీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మధ్య మాటల తూటాలు జోరుగా పేలాయి. ఈ పరిస్థితుల్లో వీరిద్దరి మధ్య యుద్ధం మొదలు కాబోతుందని అంతా భావించారు. కానీ, ఇదంతా చప్పున చల్లారిపోవడంతో జనాలకు కూడా వినోదం లేకుండా పోయింది. ప్రస్తుతం ఓటమి తర్వాత పరిస్థితులను ఎదుర్కోవాల్సిన, అలాగే తాను చేసిన తప్పులను దిద్దుకోవాల్సిన అవసరం కేసీఆర్‌కు ఏర్పడింది.
ఉప ఎన్నికలు తగ్గాలె
ఉప ఎన్నికలు అనేవి బ్రిటిష్ పార్లమెంటరీ విధానం నుంచి వచ్చినవి. వాటినే ఇప్పుడు మనం అనురిస్తున్నాం. ఉప ఎన్నికలు ఎక్కువ కావడం వల్ల ఇంగ్లండ్ క్షీణిస్తూ వస్తోందని పొలిటికల్ అబ్జర్వర్లు చెబుతూ వచ్చేవారు. దానినే ‘ఇంగ్లిష్ డిసీజ్’ అని పిలిచేవారు. ఉప ఎన్నికల వలన ప్రభుత్వం పాలనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు వెల్లడించారు. ఇండియాలో కూడా తరచూ జరుగుతున్న ఉప ఎన్నికలను ఎలా తగ్గించాలనే విషయంపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.
కేసీఆర్ పై హుజూరాబాద్ ప్రభావం
హుజూరాబాద్ ఉప ఎన్నిక కేసీఆర్ ప్రతిష్టను కచ్చితంగా దెబ్బతీసింది. దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి చెందినప్పటికీ అది హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎదురైన పరాభవం అంతటి నష్టాన్ని కలిగించలేదు. కేసీఆర్ హుజూరాబాద్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. ఇంత చేసినప్పటికీ హుజూరాబాద్‌లో ఓటమి పాలయ్యారు. ఈ ఓటమి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పరాజయం పాలవుతారనేలా ప్రభావాన్ని కలిగించింది. హుజూరాబాద్ ఓటమి కేసీఆర్ తన పంథాను తప్పనిసరిగా మార్చుకునేలా చేస్తోంది. కేసీఆర్ మార్పుకు సంబంధించి జాగ్రత్తగా అడుగులేయాలి. లేదంటే మరింత ఇబ్బందికర పరిస్థితుల్లోకి దిగజారవచ్చు. ఒకవేళ కేసీఆర్ హుజూరాబాద్‌లో గెలిచి ఉంటే తన ఏడుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా మరోలా ఉండేది.
మరిన్ని కష్టాల్లో కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మరింత కష్టాల్లోకి కూరుకుపోయింది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు రాబడుతుందని అందరూ భావించారు. అవన్నీ పటాపంచలై కాంగ్రెస్ తన అస్థిత్వాన్ని కాపాడుకోవడానికి తప్పనిసరిగా పోరాడాల్సిన అగత్యం ఏర్పడింది. అరుపులు, ధర్నాలు విజయానికి బాటలు వేయవు. కాంగ్రెస్ సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్లాలి. లేదంటే తెలంగాణలో మరో పెద్ద పార్టీతో పొత్తు పెట్టుకోవాలి. టీఆర్‌ఎస్‌తో పొత్తును కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తుందా?
టీఆర్‌ఎస్ నాయకత్వం
పార్టీలో తమకు సముచిత స్థానం కల్పించడం లేదన్న అసంతృప్తి టీఆర్‌ఎస్ నేతలలో ఉంది. కేసీఆర్, ఆయన కుటుంబం ఉప ఎన్నికలో తీవ్రంగా శ్రమించింది. కానీ మిగిలిన నాయకులందరూ ప్రేక్షకులుగానే చూస్తుండిపోయారు. ఎందుకంటే వారికెప్పుడూ వారి బాధ్యతలను కేటాయించలేదు. కేసీఆర్ బలహీనపడితే, ఇతర పార్టీలలోకి వలసలు ప్రారంభమై ఈటలలా మరింత మంది పుట్టుకొస్తారు.
బీజేపీలో జోష్
హుజూరాబాద్ విజయాన్ని తన గెలుపుగా బీజేపీ ఖాతాలో వేసుకోవచ్చు. సహజంగానే చాలా మంది ఈటల రాజేందర్ వల్లే గెలుపు సాధ్యపడిందని అనుకోవచ్చు. వాస్తవానికి బీజేపీ దాని నాయకుల సహకారం లేకుండా ఈటల గెలవలేకపోయేవారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం తన శక్తినంతా కూడగట్టి ఈటలను ఓడించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. దుబ్బాక, హుజూరాబాద్‌లో సరైన అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా ఉప ఎన్నికల్లో తుది వరకూ పోరాడవచ్చని బీజేపీ నిరూపించింది. కానీ ఆ పార్టీ 2023లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 119 మంది మంచి అభ్యర్థులను నిలబెట్టగలదా?
కేసీఆర్ ముందున్న ఆప్షన్స్
కేసీఆర్ ఉద్రేక రాజకీయాలను తగ్గించి, రోజువారీ వివాదాలను నివారిస్తూ తన పార్టీని బతికించుకోవచ్చు. ఒక సాధారణ రాజకీయ నాయకునిగా కాకుండా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వలే సౌమ్యులుగా లో ప్రొఫైల్ తో ఉండటమే కాకుండా జ్యోతిబసు, ఏకే ఆంటోనీల్లా ప్రముఖ రాజకీయ నాయకులుగా పేరు పొందొచ్చు. 32 జిల్లాలను ఏర్పాటు చేయడం ద్వారా కేసీఆర్ పెద్ద తప్పు చేశారు. దానివల్ల పాలన అసాధ్యంగా మారింది. కానీ వాటిని ఇప్పుడు తగ్గించే ధైర్యం ఆయనకు ఉందా? ఇటువంటి అస్థిరమైన తప్పులు తెలంగాణను పాలించలేని విధంగా
తయారు చేస్తున్నాయి.
ఓటు బ్యాంకులు పనిచేయవు
కుటుంబ రాజకీయాలు, కోటరీలు, నాయకత్వ భాగస్వామ్యంపై కేసీఆర్ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని వర్గాలకు నగదు పథకాలను ప్రకటిస్తే అవి ఓటు బ్యాంకులను సృష్టిస్తాయనుకోవడం రాజకీయంగా ఆత్మహత్య లాంటిది. అలాంటి పథకాల నుంచి తమను మినహాయించారనే కారణంగా యాంటీ కేసీఆర్ ఓటు బ్యాంకులు తయారవుతాయి. 2009 నుంచి 2014 వరకు అన్ని సాంఘిక సంక్షేమ పథకాల నుంచి రైతులను, అగ్ర కులాలను మినహాయించి సోనియా గాంధీ కూడా ఇలాంటి తప్పే చేశారు. అది కాంగ్రెస్ వ్యతిరేకుల ఐక్యతకు దారితీసి, కాంగ్రెస్‌ను దారుణంగా దెబ్బతీసింది. కేసీఆర్ ఒకవిషయం గుర్తు పెట్టుకోవాలి. తమను తాము మేధావులుగా చెప్పుకునే కొందరు 2018లో ఆంధ్రప్రదేశ్ కు ‘ప్రత్యేక హోదా’ కోసం బీజేపీతో తెగతెంపులు చేసుకుంటే జనాలు నీరాజనాలు పడతారని చంద్రబాబునాయుడుకు సలహా ఇచ్చారు. చంద్రబాబు తెలివైన రాజకీయ నేత అయినా కూడా వారి మాటలు విని బీజేపీ, పవన్ కల్యాణ్‌తో విడిపోయి జగన్ మోహన్ రెడ్డి సునాయాస విజయానికి కారకులయ్యారు. ఈటల రాజేందర్‌లాంటి వారి మాదిరిగానే తాను కూడా అవమానాలు భరించలేకే తెలుగుదేశం పార్టీని వీడి వచ్చాననే విషయాన్ని కేసీఆర్ గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం నాయకులు కేసీఆర్ వల్ల ఏమీ కాదన్నారు. కానీ ఆయన చరిత్ర సృష్టించారు. కేసీఆర్ మొదట తన చుట్టూ ఉన్న స్వార్థపరులను, భజనపరులను తరిమికొట్టాలి.
కేసీఆర్ తప్పులు చేసే వరకు వెయిట్ చేయాలె
బీజేపీ విషయానికొస్తే, గెలుపు చూసి పొంగిపోకుండా, కేసీఆర్ చేసే తప్పుల కోసం ఆ పార్టీ వేచి చూడాలి. అలా కాకుండా బీజేపీ ముందుగానే హైపర్ యాక్టివ్‌గా మారితే, కేసీఆర్ తన తప్పులు ముందే తెలుసుకుని సరిదిద్దుకునే అవకాశం ఉంది. అందువల్ల కేసీఆర్ తప్పులు చేయడానికి బీజేపీ అవకాశం ఇవ్వాలి. ‘‘మీ శత్రువులు పొరపాట్లు చేసేటప్పుడు వారికి భంగం కలిగించకండి”అని 200 ఏండ్ల క్రితం నెపోలియన్ మహా చక్రవర్తి చెప్పిన విషయాన్ని బీజేపీ గుర్తు పెట్టుకోవాలి.
తప్పులు దిద్దుకోవాలె
కేసీఆర్ త్వరలోనే మంత్రివర్గాన్ని విస్తరించేలాంటి పనులు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండకపోవచ్చు. కానీ ఆయన పాలన కొనసాగించాలనుకుంటే ముందుగా 32 జిల్లాల వల్ల కలిగిన డ్యామేజీని కంట్రోల్ చేయడంపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే కొన్ని జిల్లాల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. దానికి పరిష్కారం చూపినట్లయితే జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు అవకాశం కలుగుతుంది. ఆఫీస్‌లలో కంటే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, నేతల అటెన్షన్ సంపాదించాలని చూసే ‘సోషల్ మీడియా ఆఫీసర్ల’ను కేసీఆర్ పక్కకు తప్పించాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ ఇంకా పతనం అవుతారా లేక పుంజుకుంటారా అనేది పూర్తిగా ఆయన ఇష్టం. తిరిగి మొదలు పెట్టేందుకు ఆయనకు తగిన సమయం ఉన్నా మళ్లీ పద్మవ్యూహంలో చిక్కుకుంటారా, బయటపడతారా అనేది ఆయన చేతిలోనే ఉంది. కేసీఆర్ తెలివైన వారు. ప్రశ్నలు, జవాబులు అన్నీ ఆయనకు తెలుసు. కానీ కేసీఆర్ సరైన జవాబులు ఎంచుకుంటారా? చదరంగంలో కూడా మహానాయకులైన గ్రాండ్ మాస్టర్స్ కూడా చిన్న చిన్న తప్పులు చేసి భారీ మూల్యం చెల్లించుకున్నట్లే ఆయన కూడా తన తప్పులకు మూల్యాన్ని చెల్లించుకోనున్నారా? అన్నది ఆయనకే వదిలేయాల్సిన విషయం.
- పెంటపాటి పుల్లారావు, పొలిటికల్ ఎనలిస్ట్