బీజేపీ పదే పదే 400 సీట్లు గెలవాలనే లక్ష్యంతో.. నినాదంతో ప్రచారం చేయటం వెనక.. రాజ్యాంగాన్ని మార్చే వ్యూహం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాజ్యాంగాన్ని మార్చాలంటే లోక్ సభలో మూడో వంతు మెజార్టీ ఉండాలని.. అందుకే బీజేపీ ఆ లక్ష్యంతోనే బీజేపీ ఇన్ని అరాచకాలకు పాల్పడుతుందన్నారాయన. ఈ కాలంలో.. 2024 ఎన్నికల్లో ఇద్దరు ఎంపీలు ఏకగ్రీవం కావటం ఏంటని ప్రశ్నిస్తూనే.. బీజేపీ ఏ స్థాయిలో ఒత్తిడులు తీసుకొస్తుందో స్పష్టం అవుతుందన్నారు.
రాజ్యాంగం మార్చాలంటే.. దేశంలోని సగం రాష్ట్రాలు రాజ్యాంగం మార్పునకు అంగీకారం తెలపాలని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో గెలిచిన ప్రాంతీయ పార్టీలను, కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చిందని వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. రాజ్యాంగం మార్పు ద్వారా దేశంలో రిజర్వేషన్లను రద్దు చేయటానికి బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని స్పష్టంగా వివరించారు సీఎం రేవంత్ రెడ్డి.
మోదీ ప్రభుత్వంలోనే కేంద్ర మంత్రులుగా పని చేసి చాలా మంది రిజర్వేషన్లు రద్దు చేయాలని వ్యాఖ్యానించారన్నారు. 2024 ఎన్నికల్లో గెలిచి రిజర్వేషన్లు రద్దు చేయాలనేది బీజేపీ టార్గెట్ అని.. ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఈ విషయంలో ఆలోచించాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.