బీజేపీ పవర్ ఫుల్ పార్టీ.. ఎక్కడైనా సింగిల్‭గానే పోటీ చేస్తుంది: బండి సంజయ్

కొంతమంది బీజేపీ పార్టీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఎన్నికలకు ముందే సీఎం అభ్యర్థిని ప్రకటించే పార్టీ మాది కాదని చెప్పారు. ప్రత్యేక కమిటీ, పార్లమెంట్ పార్టీ బోర్డు మాత్రమే సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తాయని చెప్పారు. కొంతమంది తన పేరు రాస్తున్నారని.. అలా చేయవద్దని అన్నారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకునే అధికారం కూడా తనకు లేదని బండి చెప్పారు. అసలు తాను పోటీ చేయాలా వద్దా అనేది పార్టీ నిర్ణయిస్తుందని బండి సంజయ్ తెలిపారు. 

లిక్కర్ స్కాంలో లక్షల కోట్లు దోచుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కవిత మహిళ కాబట్టే.. ఇంటికి వెళ్లి సీబీఐ విచారణ చేస్తోంది కావచ్చని అన్నారు. బీజేపీ పవర్ ఫుల్ పార్టీ కాబట్టే... షర్మిల తమ పార్టీ మనిషి అని అబద్దపు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.  బీజేపీ ఎక్కడైనా సింగిల్ గానే పోటీ చేస్తుందన్నారు. తన పాదయాత్రకు స్వచ్ఛందంగా వేలాది మంది వస్తున్నారని బండి అన్నారు. ప్రజాసంగ్రామ యాత్రకు వస్తున్న స్పందన చూసి టీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని ఆరోపించారు. ఈనెల15న ప్రజాసంగ్రామ యాత్ర కరీంగనర్ ఎస్.ఆర్.ఆర్. కళాశాలలో ముగుస్తుందని చెప్పారు. ముగింపు యాత్ర సభకు జేపీ నడ్డా రానున్నారని... ఈ సభకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరుకావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.