
- కేంద్రంలో ఇక సంకీర్ణమే.. మా నామా నాగేశ్వర్రావు కేంద్రమంత్రి అయితడు: కేసీఆర్
- మేం 12 ఎంపీ సీట్లు గెలుస్తం
- ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ వల్లనే పేదలకు పట్టెడన్నం దొరికింది
- అబద్ధాలతో రేవంత్ అధికారంలోకి వచ్చారని విమర్శ
- ఖమ్మం కాల్వొడ్డు నుంచి జడ్పీ సెంటర్ వరకు బీఆర్ఎస్ రోడ్ షో
ఖమ్మం/మరిపెడ, వెలుగు: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 200 సీట్లకు మించి రావని, కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్అన్నారు. సర్వేలన్నీ ఇదే విషయం చెప్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్12 ఎంపీ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి ఓటేస్తే గోదారిలో వేసినట్టేనని విమర్శించారు. సోమవారం ఖమ్మం జడ్పీ సెంటర్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు మద్దతుగా నిర్వహించిన రోడ్‌షోలో కేసీఆర్ మాట్లాడారు.
‘‘ఖమ్మంలో నామాను ఎంపీగా గెలిపిస్తే.. సంకీర్ణ ప్రభుత్వంలో ఆయన కేంద్ర మంత్రి అవుతరు. రాష్ట్రానికి, ఖమ్మం జిల్లాకు చాలా మేలు జరుగుతది. ఈ అవకాశాన్ని ప్రజలు మంచిగా తీసుకోవాలి” అని కోరారు. ‘‘మోదీ మళ్లీ గెలిస్తే గోదావరిని ఎత్తుకొని పోతా.. కర్నాటక, తమిళనాడుకు తిప్పుతా అని అంటున్నరు. దాని మీద ఒక్కరైనా మాట్లాడుతున్నరా? రేవంత్ రెడ్డి ఎందుకు నోరు మెదపడంలేదు? ఈ కాంగ్రెస్దద్దమ్మలు మనకెందుకు?’’ అని కేసీఆర్అన్నారు. కాంగ్రెస్ కు ఓట్లు, సీట్లు కావాలిగానీ, మన సమస్యలు, మన రైతుల బాధలు పట్టవని తెలిపారు. మోదీ నుంచి గోదావరి, కృష్ణాను దక్కించుకోవాలన్నా.. మన హామీలు, హక్కులు సాధించుకోవాలన్నా బీఆర్ఎస్అయితేనే పేగులు తెగేదాకా కొట్లాడుతదని చెప్పారు.
ఎన్టీఆర్ వచ్చాకే సంక్షేమం
‘‘నేను ఒక్కడిని బయటకెళ్లిననాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తదని ఎవరికీ నమ్మకం లేదు. ఆమరణ దీక్ష చేస్తే అరెస్ట్ చేసి ఇదే ఖమ్మం తీసుకువచ్చారు. అప్పుడు న్యూడెమొక్రసీ పార్టీ, అన్ని సంఘాలు మద్దతు తెలిపాయి.’ అని కేసీఆర్ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో నిజమైన సంక్షేమం ఎన్టీఆర్ వచ్చినంకనే ప్రారంభమైందని, రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చిన తర్వాత పేదలకు పట్టెడంత అన్నం దొరికిందని, ఆయన అనేక మంచి కార్యక్రమాలు చేశారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్, సీఎం రేవంత్‌రెడ్డి అడ్డగోలు హామీలిచ్చారని తెలిపారు. ‘తులం బంగారం ఇస్తామన్నడు.. రేవంత్ ఇచ్చాడా? తులం బంగారం తుస్సుమన్నది.. రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతా అంటున్నడు’ అని పేర్కొన్నారు. ‘మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ఇంట్లో భోజనం చేస్తుంటే రెండు సార్లు కరెంటు పోయింది. దాన్ని చూసి ట్విట్టర్లో పెట్టిన. భట్టి విక్రమార్క కాదు వట్టి విక్రమార్క.. కరెంటు పోలేదని అబద్ధం చెబుతున్నడు. ఓయూలో కరెంటు, నీళ్లు లేవని చీఫ్ వార్డెన్ చెప్పినందుకు సస్పెండ్ చేస్తమని నోటీస్ ఇచ్చిన్రు. టీఆర్ఎస్ హయాంలో వరికోతలుంటే.. ఇప్పుడు కరెంటు కోతలున్నయి. అబద్ధాలు మాట్లాడి, అడ్డగోలు హామీలిచ్చి, ప్రజలను బురిడీ కొట్టించి రేవంత్ అధికారంలోకి వచ్చిండు. హామీలపై ప్రశ్నిస్తే జైల్లో వేస్తా అంటున్నడు. నేను జైళ్లకు.. తోకమట్టలకు భయపడ్తనా?” అని ప్రశ్నించారు.
రోడ్డుపక్కన హోటల్లో టీ తాగిన కేసీఆర్
ఖమ్మం రోడ్ షోకు వెళ్తూ కేసీఆర్ మార్గమధ్యంలో మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పరిధిలోని ఎల్లంపేట స్టేజీ వద్ద ఆగారు. మాజీ మంత్రి ఎర్రబెల్లితో కలిసి రోడ్డుపక్కనే ఉన్న హోటల్లో మిర్చీలు తిని, టీ తాగారు. స్థానిక మహిళలు పలకరిస్తే వాళ్లకు పకోడీలు ఇచ్చి ముచ్చటించారు. హోటల్ యజమాని, ఇతరులతో కాసేపు సరదాగా మాట్లాడారు. అనంతరం మరిపెడ మండల కేంద్రంలో బీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలకు బస్సులోనుంచి అభివాదం చేస్తూ ఖమ్మం రోడ్ షోకు తరలివెళ్లారు.
నీళ్లున్నా పంటలు ఎండబెట్టిన్రు
నాగార్జున సాగర్‌లో 495 అడుగుల మేర వాటర్ ఉన్నా తాను నల్గొండ, ఖమ్మానికి సాగునీళ్లు ఇప్పించానని, పాలేరు రిజర్వాయర్ఎప్పుడూ మత్తడి దుంకే పరిస్థితి ఉండేదని కేసీఆర్అన్నారు. ఇప్పుడు 510 అడుగులున్నా పంటలు ఎండబెట్టిండ్రు తప్ప నీళ్లియ్యలేదని తెలిపారు. ఐదెకరాలుంటేనే రైతు బంధు ఇస్తామని అంటున్నరని, ఆరెకరాలున్నోడు కోటీశ్వరుడా? అని ప్రశ్నించారు. ఖమ్మం చైతన్యవంతమైన జిల్లా అని, నామాను గెలిపించి బీఆర్ఎస్కు బలం ఇవ్వాలని కోరారు. ఈ జిల్లాకు చెందిన తన మీద బయట వ్యక్తిని తీసుకువచ్చి పోటీకి నిలబెట్టారని, మళ్లీ ఒకసారి తనకు ఓటేసి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.